ప్రతిపాదనలు పంపాం
● పశుసంవర్థక శాఖలో భర్తీకి నోచుకోని ఖాళీలు ● 219 పోస్టులకు 156 మంది అధికారులు, సిబ్బంది ● 63 ఖాళీలు నింపకుండా కాలయాపన ● అందుబాటులోలేని పాముకాటు మందులు
పాల్వంచరూరల్: జిల్లా పశువైద్యశాఖలో ఖాళీ పోస్టులను భర్తీ చేయకపోవడంతో పశువులకు వైద్యం సేవలు పూర్తిస్థాయిలో అందడంలేదు. దీంతో పశువుల పెంపకందారులు ప్రైవేటు వైద్యం అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో మొత్తం 80 పశువైద్యశాలలు ఉన్నాయి. పాల్వంచ, కొత్తగూడెం, బూర్గంపాడు, భద్రాచలం, అశ్వారావుపేట, ఇల్లెందులలో ఆరు ప్రాంతీయ పశువైద్యశాలలతోపాటు 30 ప్రాథమిక పశువైద్యశాలలు, 44 ప్రాథమిక ఉప పశువైద్యశాలలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా నల్ల, తెల్ల పశువులు, గొర్రెలు, మేకలు, పెరటికోళ్లు మొత్తం 22,71,166 లక్షలు ఉన్నట్లు పశుసంవర్ధకశాఖ గణాంకాలు చెబుతున్నాయి. పశుసంవర్థకశాఖలో జిల్లావ్యాప్తంగా 219 పోస్టులు ఉండగా, ప్రస్తుతం 156 మంది సిబ్బందే ఉన్నారు. 63 ఖాళీలు ఉన్నాయి.
జిల్లా పశువైద్యాధికారి ఇన్‌చార్జే..
జిల్లా పశువైద్యాధికారి రెండు నెలల క్రితం ఉద్యోగ విరమణ పొందారు. ఆ స్థానంలో ఎవరినీ నియమించలేదు. కార్యాలయంలో ఏడీకి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించి నెట్టుకొస్తున్నారు. ఇక ఆరు ప్రాంతీయ పశువైద్యశాలలు ఉండగా, ఇవి అడిషనల్ డైరెక్టర్(ఏడీ) పర్యవేక్షణలో ఉంటాయి. కానీ ప్రస్తుతం ముగ్గురే ఏడీలు ఉన్నాయి. పాల్వంచ, బూర్గంపాడు, భద్రాచలం ఏడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. భద్రాచలంలో ఏడీ రెండేళ్లుగా వరంగల్‌లోని కోళ్ల పరిశోధన సంస్థలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. ఇక రామవరం, చంచుపల్లి, వినాయకపురం, ములకలపల్లి ప్రాథమిక పశు వైద్య కేంద్రాల్లో పశువైద్యాధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ములకలపల్లి జేఏఓ పాల్వంచ ఏడీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. యానంబైల్ పశువైద్యాధికారి హిందుతేజ్‌కు రామవరం పశువైద్యాధికారిగా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు.
పాము కాటు మందులు లేవు..
జిల్లాలోని పశువులకు విషసర్పాలు, పురుగులు కరిస్తే ఇచ్చే మందులు పశువైద్యశాలలో అందుబాటులేదు. దీంతో పశువులు విషసర్పాల కాటుకు మృత్యువాత పడుతున్నాయి. ఇటీవల గోదావరి వరద వచ్చిన ప్రాంతంలో సారపాకలో మేతకు వెళ్లిన పశువును పాము కాటువేయడంతో మృతి చెందింది. పశువైద్యశాలలో రిఫ్రిజిరేటర్లు లేకపోవడంతో పాము కాటు మందులు అందుబాటులో ఉండటంలేదు. దీంతో రైతులు ప్రైవేటు దుకాణాల నుంచి కొనగోలు చేయాల్సి వస్తోంది. గత మంగళవారం గాయాలపాలైన ఓ దుప్పిని అటవీశాఖ అధికారులు ఆస్పత్రికి తీసుకొస్తే పశువైద్యులు అందుబాటులో లేరు. దీంతో సకాలంలో వైద్యం అందక జింక, దాని కడుపులోని శిశువు మృత్యువాత పడ్డాయి.
కేడర్ పోస్టులు ప్రస్తుతం ఖాళీలు
ఉన్నది
అసిస్టెంట్ డైరెక్టర్ 6 3 3
వెటర్నరీ ఆఫీసర్ 30 26 4
జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ 18 12 6
వెటర్నరీ లైవ్‌స్టాక్ ఆఫీసర్ 10 3 7
లైవ్ స్టాక్ అసిస్టెంట్ 24 23 1
వెటర్నరీ అసిస్టెంట్ 23 14 9
అటెండర్ 69 40 29
వెటర్నరీ వాక్సినేటర్ 14 2 12
పశువైద్యశాలల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. జిల్లాలో పాముకాటు మందులు పశువైద్యశాలలో లేని మాట నిజమే. భద్రపరిచే రిఫ్రిజ్‌రేటర్లు లేకపోవడం వల్లే ఆ మందులను పశువైద్యశాఖ పరిధిలో ఉంచలేదు. – బొల్లం మల్లయ్య,
జిల్లా ఇన్‌చార్జి పశువైద్యాధికారి


