వ్యాపారి చెప్పిందే వేదం
ఎకరాకు 2 – 3 క్వింటాళ్లు దాటని దిగుబడి
ఈ పంటకూ దక్కని మద్దతు ధర
క్వింటాకు రూ.2,500కు పైగా నష్టం
ప్రభుత్వ కొనుగోళ్ల కోసం ఎదురుచూపులు
ప్రయోజనం శూన్యం..
ప్రభుత్వం కొంటే బాగుండు..
పెసర సాగు వివరాలు (ఎకరాల్లో)
ఖమ్మంవ్యవసాయం: ప్రభుత్వం కొనుగోళ్లు లేకపోవడంతో పెసలకు కనీస మద్దతు ధర నమోదు కావడం లేదు. పంట చేతికి వస్తున్నా ప్రభుత్వం కొనుగోళ్లపై దృష్టి సారించకపోవడాన్ని అదునుగా తీసుకున్న వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయించి రైతులను దగా చేస్తున్నారు. జిల్లాలో అపరాల పంటల్లో మెట్ట పంటగా రైతులు పెసర సాగు చేస్తుంటారు. ఈ సారి ఉమ్మడి జిల్లాలో సాగు విస్తీర్ణం పెరిగినా తగిన వర్షాలు లేక దిగుబడులు అంతంత మాత్రంగా ఉన్నాయి. అరకొరగా వచ్చిన పంటకు సైతం కనీస మద్దతు ధర దక్కక రైతులకు నష్టం ఎదురవుతోంది.
దిగుబడి రాక.. ధర లేక...
పెసర పంట ఈ ఏడాది అంతంత మాత్రంగా దిగుబడులు వచ్చాయి. విత్తనం వేసిన సమయంలో వర్షాలు అనుకూలించినా, పూత, కాత దశలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రభావం దిగుబడిపై పడింది. ఎకరాకు రెండు నుంచి మూడు క్వింటాళ్లకు మించి దిగుబడి రావడం లేదు. ఎకరం సాగుకు రూ.15 వేల వరకు పెట్టుబడి రైతులు అందులో రూ.5 వేల వరకు నష్టపోతున్నారు.
ప్రభుత్వ కొనుగోళ్లపై ఆశలు
వ్యాపారులు పెసలకు కనీస మద్దతు ధర చెల్లించకపోవడంతో రైతులు ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నారు. ఇకనైనా కేంద్రాలు ఏర్పాటుచేసి రూ.8,780 ధరతో కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, పంట చేతికందుతున్నా కొనుగోళ్లపై స్పష్టత రాలేదు. మార్క్‌ఫెడ్ మాత్రం పెసల కొనుగోలు అంశంపై కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్‌కు లేఖ రాసింది. నాఫెడ్ అనుమతిస్తే త్వరలోనే కొనుగోలు చేస్తామని మార్క్‌ఫెడ్ ఉమ్మడి జిల్లా మేనేజర్ నరసింహారావు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పెసలు క్వింటాకు రూ.8,780గా మద్దతు ధర నిర్ణయించింది. అయి తే, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే ఈ ధర దక్కేది. కానీ అలా జరగకపోవడంతో వ్యాపారులే ధర నిర్ణయిస్తున్నారు. గ్రామాల్లో నాణ్యత ఆధారంగా క్వింటాకు రూ.5వేల నుంచి రూ. 5,500 వరకు చెల్లిస్తుండగా... ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో రూ.6వేల నుంచి రూ.7వేల వరకు ధర పలుకుతోంది. పంటకు డిమాండ్ ఉన్నా వ్యా పారులు సిండికేట్‌గా ఏర్పడడంతో రైతులకు మద్దతు ధర దక్కడం లేదు. ఫలితంగా క్వింటా కు రూ. 2,500 మేర నష్టపోతున్నారు. ఇక నాణ్యత లేని పంటను రూ.5 వేలకు మించి కొనుగోలు చేయడం లేదు.
మూడున్నర ఎకరాల్లో పెసర సాగు చేస్తే ఎకరాకు 2క్వింటాళ్లు మించి దిగుబడి రాలేదు. క్వింటాకు రూ.7వేలు వస్తుందనుకుంటే రూ.6,200 మాత్రమే చెల్లించారు. దీంతో ప్రయోజనం లేకపోగా శ్రమ వృథా అయింది. – జోయినబోయిన బాబు, పుట్టకోట
ప్రభుత్వం పెసలను కొనుగోలు చేస్తే మద్దతు ధర లభించేది. వ్యాపారులు పెసలు నాణ్యతగా ఉన్నా రూ. 6,300 చొప్పునే కొనుగోలు చేశారు. ప్రభుత్వం పట్టింపు లేక వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
– గుడ్ల జగన్నాథం, కూసుమంచి
జిల్లా అంచనా సాగు
ఖమ్మం 15,606 30,152 భద్రాద్రి కొత్తగూడెం 900 7,747


