ఆగిన రోడ్ల నిర్మాణాలు
ఫారెస్ట్ అనుమతులురాక నిలిచిన రోడ్లు, వంతెనల పనులు
సంరక్షణ చట్టాల అమలుకే
అటవీశాఖ అధికారుల మొగ్గు
రోడ్లు లేక ఇక్కట్లు ఎదుర్కొంటున్న
ఏజెన్సీ ప్రజలు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: బూర్గంపాడు మండలం మీదుగా వెళ్లే జాతీయ రహదారి (ఎన్‌హెచ్ 30) నుంచి కేవలం 3 కి.మీల దూరంలో చింతకుంట గ్రామం ఉంది. అత్యవసర పరిస్థితి ఎదురైతే గ్రామస్తులు సమీపంలోని సారపాకకు చేరుకునేందుకు సరైన రోడ్డు లేదు. సోమవారం ఈ గ్రా మానికి చెందిన ఓ గర్భిణి 108లోనే ప్రసవం పొందడం ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. 15 ఏళ్లుగా ఈ తరహా సమస్యలను జిల్లాలో అనేక గ్రామాలు ఎదుర్కొంటున్నాయి. అడవుల సంరక్షణ పేరుతో అటవీశాఖ రోడ్లు, కల్వర్టుల నిర్మాణానికి అనుమతులు ఇవ్వకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. సమస్యల పరిష్కారానికి కనీసస్థాయిలో చొరవ కూడా లేదు. ఫలితంగా ఏటా వానాకాలంలో అనా రోగ్యంబారిన పడినవారు సకాలంలో ఆస్పత్రులకు వెళ్లలేకపోతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.
యాక్షన్ ప్లాన్ ఏదీ?
దండకారణ్యంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల ప్రభావంతో భద్రాద్రి, ములుగు జిల్లాలకు ఛత్తీస్ గఢ్ నుంచి వలసలు పెరిగాయి. అప్పటికే ఉన్న ఏజెన్సీ గ్రామాలకు, వలస ఆదివాసీ గూడేలు జత కలవడంతో అడవులపై ఒత్తిడి పెరిగింది. ఈ ఒత్తిడి తగ్గించేందుకు వలస ఆదివాసీ గూడేలపై ప్రత్యేక యాక్షన్ ప్లాన్ అమలు చేయడంలో తెలంగాణ అటవీశాఖ విఫలమైందనే ఆరోపణలు వస్తున్నా యి. ఇటీవల వరకు యాంటీ మావోయిస్టు ఆపరేషన్లకు కేంద్రం దండిగా నిధులు సమకూర్చింది. ఆ సమయంలో అడవులపై పడిన ఒత్తిడిని నివారించే అవకాశం ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. కేవలం అనుమతుల పేరుతో అడ్డుకోవడంతోనే ఫారె స్టుశాఖ సంతృప్తి చెందుతోంది. సమస్య మూ లాల్లోకి వెళ్లి పరిష్కారాలు వెతకడంలేదు.
మావోయిస్టు ప్రభావిత నిధులు వచ్చేనా..?
గతంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి నిధుల కోటాలో ఆళ్లపల్లి –మామకన్ను మధ్య కిన్నెరసాని వాగుపై రూ.9 కోట్లతో 2019లో వంతెన పనులు చేపట్టారు. వంతెన పిల్లర్ ఒకటి అభయారణ్యం పరిధిలో ఉందంటూ అటవీశాఖ పనులను ఆపేసింది. ఇదే మండలంలో వీరాపురం క్రాస్‌రోడ్ నుంచి రేగళ్ల మీదుగా ఆళ్లపల్లి మండలం మర్కోడు వరకు రోడ్డుకు రూ. 4 కోట్లు కేటాయించారు. పాల్వంచ మండలంలో మొండికట్ట–కారెగట్టు రోడ్డుకు రూ.6కోట్లు మూడేళ్ల క్రితం మంజూరయ్యాయి. ఫారెస్టు శాఖ అభ్యంతరాలతో ఆ పనులన్నీ మధ్యలో ఆగిపోగా, నిధులు వెనక్కి మళ్లాయి. ప్రస్తుతం మావోయిస్టుల ప్రభావం తగ్గిపోవడంతో ఆ కోటాలో మళ్లీ నిధులు వచ్చేది అనుమానమే.
కొండరెడ్ల తరహాలో..
ఇటీవల దమ్మపేట మండలం పుసుకుపల్లి విషయంలో జిల్లా యంత్రాంగం ఒక్కతాటిపై నడిచి ఫారెస్టు అభ్యంతరాలను పరిష్కరించాయి. దీంతో అక్కడి కొండరెడ్లకు రోడ్లు, వంతెనలతోపాటు ఇతర అభివృద్ధి పనులు చేరువయ్యాయి. ఏజెన్సీ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మరోసారి అదే స్ఫూర్తి చాటాలని జిల్లా వాసులు కోరుతున్నారు.
అటవీ శాఖ అభ్యంతరాలతో జిల్లా వ్యాప్తంగా అనేక రోడ్ల నిర్మాణాలు జరగలేదు. అశ్వారావుపేట మండలంలో గాండ్లగూడెం–చెన్నాపురం రోడ్డు, ములకలపల్లి మండలం తిమ్మంపేట–గుండాలపాడు రోడ్డు, చండ్రుగొండ మండలంలో బెండాలపాడు–బ్రాహ్మలకుంట, ఇల్లెందు మండలం మొండితోగు–ధర్మాపురం తదితర రోడ్లకు నిధులు మంజూరయ్యాయి. కానీ అటవీశాఖ అభ్యంతరాలతో పనులన్నీ అర్ధంతరంగా ఆగిపోయాయి. నిలిచిపోయిన వంతెనలు, కల్వర్టుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.


