భద్రాచలం: భద్రాచలంలో డిసెంబర్‌లో జరిగే ముక్కోటిలోగా ఉత్తర ద్వారం పనులు పూర్తి చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ ఆదేశించారు. శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థాన పునరుద్ధరణ, అభివృద్ది పనులపై సోమవారం హైదరాబాద్‌లో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్తర ద్వారం వైపు పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. గోదావరి పుష్కరాల నాటికి పనులన్నీ పూర్తయ్యే విధంగా ప్రణాళికలను రూపొందించాలన్నారు.
ఉత్తర, పడమర మెట్లు తొలగించాం
ఇప్పటికే ఉత్తరం ద్వారం, ఫుట్ బ్రిడ్జిలను తొలగించామని, మంగళవారం నుంచి ఉత్తరం, పడమర వైపు మెట్లను తొలగించే ప్రక్రియ చేపడతామని ఆలయ ఈఓ దామోదర్‌రావు సెక్రటరీకి వివరించారు. మూజియంలో ఉన్న, రోజువారి పూజా కార్యక్రమాల్లో వినియోగించే స్వామివారి బంగారు ఆభరణాలను బ్యాంకులో డిపాజిట్ చేస్తామని, ఆ తరువాత ప్రాకారాల తొలగింపు పనులు చేపడతామని వివరించారు.
యాగశాల తొలగింపు
దేవస్థానంలో జరుగుతున్న ఆలయ పునరుద్ధరణ పనుల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఉన్న యాగశాలను పూర్తిగా తొలగించారు. భద్రుని గుడి వెనుక ఉన్న యాగశాల, స్వామి వారికి ప్రసాదాలను తయారు చేసే వంటశాలలు ఉన్నాయి. యాగశాలను పూర్తిగా తరలించగా, వంటశాలను సైతం తొలగించేందుకు అందులో ఉన్న సామగ్రిని తరలించారు. భద్రుని శిల మినహా ఆలయ నిర్మాణం పూర్తిగా కూల్చనున్నారు. భద్రుని శిలకు భక్తులు పూజలు చేసే విధంగా ఏర్పాట్లు చేయనున్నారు. ఈ ప్రాంగణంలో ఉన్న గ్రిల్స్, క్యూలైన్లను ఇప్పటికే తొలగించారు.
దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
శైలజా రామయ్యర్


