భద్రాచలం: పర్యావరణ పరిరక్షణకు తోడ్పడేవిధంగా కొన్నేళ్లుగా మట్టి గణపతులను ప్రతిష్ఠిస్తున్నారు. భద్రాచలంలోని అశోక్‌నగర్ కాలనీకి చెందిన పవర్ బోయ్స్ కమిటీ ఆధ్వర్యంలో మట్టితో 20 అడుగుల విగ్రహాన్ని తయారుచేస్తున్నారు. ఖైరతాబాద్ తరహాలో వేదిక వద్దనే భారీ వినాయకుడిని రూపొందిస్తున్నారు. 9 ఏళ్లుగా గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్న కమిటీ కోల్‌కతా కళాకారులతో విగ్రహం తయారీకి ఒప్పందం చేసుకున్నారు. టన్ను బరువు గల విగ్రహాన్ని రూ.2.5 లక్షలతో సిద్ధం చేయిస్తున్నట్లు తెలిపారు. మూడు రోజుల క్రితం పనులు ప్రారంభం కాగా, పూర్తిగా పర్యావరణ హితంగా తయారు చేస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకుండే వెదురు బొంగులు, కర్రలు, బంక మట్టి, వరి పొట్టు వినియోగిస్తున్నారు. ఐదుగురు కళాకారులు ప్రస్తుతం మట్టి విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. ఆ తర్వాత రంగులను అద్దనున్నారు. సెప్టెంబర్ 27న వినాయక చవితి రోజున భారీ విగ్రహాన్ని కొలువుదీర్చనున్నారు. ప్రజల సహకారంతో 60 మందితో సభ్యుల కమిటీ వేడుకలకు ఏర్పాట్లు చేస్తోందని అధ్యక్ష, కార్యదర్శులు, వల్లూపు ప్రేమ్‌చంద్, ఎప్పు సత్యకాంత్, కోశాధికారి రేగా సందీప్ తెలిపారు.
20 అడుగుల మట్టి విగ్రహం తయారీ..


