‘సీతారామ’ నీరు చేరుతుండడంతో రైతుల్లో హర్షం
ఆఫ్‌టేక్ పాయింట్ల ద్వారా
చెరువుల్లోకి జలాలు
నిండుకుండలా పెద్దయ్య చెరువు, అలుగు పోస్తున్న శ్రీరాముల కుంట
పొంచి ఉన్న ప్రమాదం
ములకలపల్లి: సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా విడుదల చేస్తున్న గోదావరి జలాలతో చెరువులు జల కళ సంతరించుకుంటున్నాయి. ఆఫ్‌టేక్ (ఓటీ) పాయింట్ల ద్వారా గోదావరి జలాలు చెరువుల్లోకి చేరి జలకళ సంతరించుకున్నాయి. వర్షాభావ పరిస్థితుల్లోనూ తటాకాల్లో పూర్తిస్థాయిలో నీరు చేరి నిండుకుండల్లా మారుతుండడంతో ఆయకట్టు రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
వారం రోజులుగా విడుదల
గోదావరి జలాలను అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు పంప్‌హౌస్ – 1 నుంచి వారం రోజులుగా విడుదల చేస్తున్నారు. ఈ జలాలు ములకలపల్లి మండలం వీకే రామవరం శివారు పంప్‌హౌస్ – 2కు, అక్కడి నుంచి కమలాపురం పంప్‌హౌస్ – 3 ద్వారా ఏన్కూర్ లింక్ కెనాల్‌కు చేరి వైరా రిజర్వాయర్‌లోకి వెళ్తున్నాయి. కాగా, పంప్‌హౌస్–3 డిశ్చార్జ్ పాయింట్ సమీపాన ఉన్న ఆఫ్‌టేక్ (ఓటీ) ద్వారా గోదావరి జలాలు సమీప చెరువుల్లోకి ఉరకలెత్తుతున్నాయి. మొదటి ఓటీ ద్వారా పారేటి వాగు మీదుగా కమలాపురం శివారు పెద్దయ్య చెరువులోకి నీరు చేరుతోంది. ఈ చెరువు ఒకటి, రెండు రోజుల్లో నిండనుండడంతో ఆయకట్టులో పంటల సాగుకు డోకా లేదని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, మంగళవారం రైతులు కల్తీ పాపయ్య, కుంజా రామ్మూర్తి, బాల అప్పారావు, గొగ్గెల ఆదినారాయణ, సుగ్గల విజయబాబు, గుడ్డూరి నర్సింహారావు, కుంజా ప్రమోద్, కల్తీ రామకృష్ణ, గొగ్గెల నరేశ్, గద్దె మధు తదితరులు చెరువు వద్ద నీటిని పరిశీలించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు.
మత్తడి పోస్తోంది.
మండలంలోని గుట్టగూడెం శివారు శ్రీరాములకుంట చెరువులోకి గోదావరి జలాలు చేరడంతో మత్తడి పోస్తోంది. పంప్‌హౌస్–3 ప్రధాన కాల్వపై నిర్మించిన ఆఫ్‌టేక్ (ఓటీ) పాయింట్ ద్వారా దిగువకు గోదారమ్మ పరవళ్లు తొక్కుతోంది. వరద ప్రవాహంతో చెరువు పూర్తి సామర్థ్యం మేర నిండగా అలుగు బయటకు ప్రవహిస్తూ సమీపాన వాగులో కలుస్తోంది. అయితే, చెరువులు నిండి అలుగు పారుతూ సమీప వాగుల్లో కలుస్తున్నా జలవనరుల శాఖ అఽధికారులు దృష్టి సారించకపోడం విమర్శలకు తావిస్తోంది. చెరువు నిండిన వెంటనే ఆఫ్‌టేక్ పాయింట్ మూసివేస్తే వృథాను అరికట్టవచ్చని రైతులు సూచిస్తున్నారు.
కమలాపురం శివారులోని పంప్‌హౌస్–3 నుంచి గోదావరి జలాల ఎత్తిపోతలు నిరంతరాయంగా సాగుతున్నాయి. ఇక్కడి మెయిన్ కెనాల్ నుంచి గ్రావిటీ ద్వారా నీళ్లు దిగువకు పారుతున్నాయి. వారం రోజులుగా ప్రవాహం సాగుతుండడంతో పంప్‌హౌస్–3 నుంచి కొంతమేర ముందుకు సాగాక రిటైనింగ్ వాల్‌కు కోత మొదలైంది. ఇక్కడ కొంతమేర ముక్కలుగా విరిగిపోయింది. నీటి ప్రవాహ ఉధృతికి క్రమేపీ సిమెంట్ వాల్ మరింత కోతకు గురైతే కట్టపై ప్రభావం పడనున్నందున అధికారులు వాల్ పటిష్టతకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


