ట్యాంకర్‌ బోల్తా.. డ్రైవర్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

ట్యాంకర్‌ బోల్తా.. డ్రైవర్‌ మృతి

Jul 15 2026 12:35 AM | Updated on Jul 15 2026 12:35 AM

ములకలపల్లి: అదుపుతప్పి ట్యాంకర్‌ బోల్తా పడిన ఘటనలో మంగళవారం డ్రైవర్‌ మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం, జలాం జిల్లా, కల్పి తహసీల్‌, సంధి గ్రామానికి చెందిన మనోజ్‌కుమార్‌ (28) ట్యాంకర్‌తో సూర్యాపేట నుంచి పోలవరానికి సిమెంట్‌లోడుతో బయలుదేరి, అక్కడ డంప్‌ చేసి, పాల్వంచ కేటీపీఎస్‌కు యాష్‌ కోసం వస్తున్నాడు. ఈ క్రమంలో పూసుగూడెం శివారులో ట్యాంకర్‌ అదుపుతప్పి రోడ్డు పక్కన గల తెల్లవాగు అలుగు కాలువలో పడింది. సుమారు 30 అడుగుల లోతులోని గోతిలో ట్యాంకర్‌ ఇరుక్కుపోవడంతో, డ్రైవర్‌ మనోజ్‌కుమార్‌ అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ మధుప్రసాద్‌ ఘటనాస్థలికి చేరుకొని, వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

మట్టి ట్రాక్టర్లు సీజ్‌

అశ్వారావుపేటరూరల్‌: అనుమతి లేకుండా సాగునీటి చెరువు నుంచి మట్టి తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను మంగళవారం సీజ్‌ చేశారు. అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధి అల్లూరి సీతారామరాజు కాలనీ వెనుక వైపు ఉన్న దుప్పులకుంట చెరువు నుంచి కొందరు అక్రమంగా మట్టి తరలిస్తున్నారు. ఈ మేరకు నీటి పారుదల శాఖ ఏఈ రియాజ్‌, పోలీసు సిబ్బంది తనిఖీ చేసి రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని తహసీల్‌కు తరలించినట్లు ఎస్‌ఐ టి.యయాతిరాజు తెలిపారు.

బాల కార్మికుడితో పనిచేయిస్తున్న వ్యక్తిపై కేసు

భద్రాచలంఅర్బన్‌: భద్రాచలం పట్టణంలోని చర్ల రోడ్డులోని ఓ దుకాణ యజ మాని బాలకార్మికుడితో పనిచేయిస్తుండగా.. భద్రాచలంటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ స్వప్న కథనం ప్రకారం.. పట్టణంలోని దుకాణంలో బాల కార్మికుడితో పనులు చేయిస్తున్నట్లు తెలుసుకున్న ముస్కాన్‌ ఆపరేషన్‌ బృందం సభ్యులు దాడులు జరిపి, పనిచేస్తున్న బాలుడిని అదుపులోకి తీసుకుని, అతని తల్లిదండ్రులకు అప్పగించారు. దుకాణం నిర్వాహకుడిపై టౌన్‌ ఎస్‌ఐ స్వప్న కేసు నమోదు చేశారు.

మున్సిపల్‌ కాంట్రాక్టర్‌పై..

పాల్వంచ: బాలుడితో పనులు చేయించుకుంటున్న మున్సిపల్‌ కాంట్రాక్టర్‌పై మంగళవారం కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు.. రాంనగర్‌కు చెందిన మున్సిపల్‌ కాంట్రాక్టర్‌ పల్లపుల కొండల్‌రావు తహసీల్దార్‌ కార్యాలయం రోడ్‌లో డ్రెయినేజీ కాంక్రీట్‌ పనులు చేయిస్తున్నాడు. కాగా అక్కడ గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన బాలుడితో పనిచేయిస్తుండగా ఆపరేషన్‌ ముస్కాన్‌లో భాగంగా బూర్గంపాడు ఎస్‌ఐ రామ్మూర్తి, కానిస్టేబుల్‌ అర్జున్‌రావు, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ సూపర్‌వైజర్‌ లలిత, ఇతర టీం సభ్యులు కలిసి పట్టుకున్నారు. సూపర్‌వైజర్‌ లలిత ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్‌ఐ నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గురుకులం అధ్యాపకురాలి సస్పెన్షన్‌

కారేపల్లి: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలడంతో కారేపల్లి మైనార్టీ గురుకుల కళాశాల అధ్యాపకురాలిని సస్పెండ్‌ చేశారు. ఈ నెల 3న మైనార్టీ గురుకుల కాలేజీలో చదివే ఓ బాలిక బంధువు అని చెబుతూ మహిళ వచ్చి బయటకు తీసుకెళ్లింది. అయితే, ముగ్గురు మహిళలు, ఓ యువకుడు కలిసి సదరు బాలికను కిడ్నాప్‌ చేసినట్లు ఆ తర్వాత బయటపడింది. ఈ మేరకు నలుగురిపై పోక్సో కేసు కూడా నమోదైంది. అయితే, ఆ సమయాన విధుల్లో ఉన్న అధ్యాపకురాలు దుర్గాభవాని అలసత్వమే ఇందుకు కారణమని నిర్ధారించి ఆమెను సస్పెండ్‌ చేస్తూ ఉన్నతాధికారులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement