కూనంనేనిపై ఫిర్యాదు అవాస్తవం | - | Sakshi
Sakshi News home page

కూనంనేనిపై ఫిర్యాదు అవాస్తవం

Jul 15 2026 12:35 AM | Updated on Jul 15 2026 12:35 AM

ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి

కొత్తగూడెంఅర్బన్‌: కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుపై తాను కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు చేసినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి పేర్కొన్నారు. ఎమ్మె ల్యే కూనంనేని ఇసుక దందాలు, భూకబ్జాలు చేస్తున్నారని తాను ఫిర్యాదు చేసినట్లు ప్రసారమైన వార్తలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ కాంగ్రెస్‌ ఎంపీలతో ‘సర్‌’పై మాత్రమే వివరాలు తీసుకున్నారని, అందులో తాను పాల్గొన్నానే తప్ప ఇతర అంశాలపై చర్చ రాలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంలో సీపీఐ, కాంగ్రెస్‌ కలిసికట్టుగా ఉన్నాయని, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఎంపీ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.

డీ–అడిక్షన్‌ సెంటర్‌కు నలుగురి తరలింపు

భద్రాచలంఅర్బన్‌: భద్రాచలం పట్టణంలోని కూనవరం రోడ్డులో గల కింగ్స్‌ దాబా ఎదురుగా ఉన్న ఖాళీ ప్రాంతంలో మంగళవారం టౌన్‌ ఎస్‌ఐ స్వప్న పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న క్రమంలో పోలీసులను చూసి ఇద్దరు యువకులు పారిపోతుండగా వారిని పట్టుకుని పట్టణంలోని డీ–అడిక్షన్‌ సెంటర్‌లో వారిని చేర్పించారు. కాగా రెండు రోజుల క్రితం మరో ఇద్దరు యువకులను కూడా డీ–అడిక్షన్‌ సెంటర్‌లో చేర్పించినట్లు ఎస్‌ఐ స్వప్న తెలిపారు. కాగా భద్రాచలంలో ఎక్కడైనా ఎవరైనా గంజాయి సేవిస్తున్నట్లు లేదా విక్రయిస్తున్నట్లు సమాచారం ఉంటే పట్టణ పోలీసులకు తెలపాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆమె పేర్కొన్నారు.

ఆర్టీసీ విలీన హామీ

అమలుచేయాలి

మధిర: ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌(సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షుడు వీరాంజనేయులు కోరారు. మధిరలో మంగళవారం జరిగిన సమావేశంలో యూనియన్‌ మధిర డిపో కమిటీని ప్రకటించారు. అనంతరం వీరాంజనేయులు మాట్లాడుతూ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. అంతేకాక సమ్మె సందర్భంగా కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు బకాయిలను చెల్లించాలని కోరారు. నాయకులు శీలం నరసింహారావు, పడకంటి మురళి, మందా సైదులు, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ నాయకులు లింగమూర్తి, పద్మావతి, సుధాకర్‌, నర్సిరెడ్డి, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

హత్య కేసులో జీవిత ఖైదు

హనుమకొండ జిల్లా వాసికి శిక్ష

ఖమ్మంలీగల్‌: మహిళ విషయమై ఘర్షణ పడి ఒకరిని హత్య చేసిన హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌ మండలం పెద్ద పెండ్యాల గ్రామానికి చెందిన రాపోలు వెంకటేశ్వర్లు అలియాస్‌ రాజుకు జీవిత ఖైదు విధిస్తూ ఖమ్మం నాలుగో అదనపు సెషన్స్‌ జడ్జి డాక్టర్‌ జీవీ మహేశ్‌నాథ్‌ తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం.. ఖమ్మంలోని ప్రకాష్‌నగర్‌కు చెందిన దుగ్యాల అంజిబాబు ఇంటికి ఆయన బావమరిది శీలం వెంకటేశ్‌ 2021 ఫిబ్రవరి 13న వచ్చాడు. సాయంత్రం బయటకు వెళ్లగా, రాత్రి 9.30 గంటల సమయాన కత్తిపోట్లకు గురైన ఆయనను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమాన అంజిబాబు భార్య వెంకటేశ్‌ను వివరాలు ఆరా తీయగా.. ఖమ్మం వినోద థియేటర్‌ వద్ద ఓ మహిళతో మాట్లాడుతుండగా.. రాపోలు వెంకటేశ్వర్లు వచ్చి తనతో సన్నిహితంగా ఉండే ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావంటూ కత్తితో పొడిచాడని వెల్లడించాడు. దీంతో ఖమ్మం వన్‌ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా వెంకటేశ్వర్లును అరెస్ట్‌ చేశారు. చికిత్స పొందుతూ వెంకటేశ్‌ మరణించడంతో హత్య కేసుగా మార్చి కోర్టులో చార్జి షీట్‌ దాఖలు చేశారు. ఈ కేసులో 12 మంది సాక్షులను విచారించాక వెంకటేశ్వర్లుపై నేరం రుజువు కావడంతో జీవితఖైదు విధించడమే కాక రూ.10 వేలు జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలల జైలు శిక్ష అనుభవించాలని పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్‌ తరఫున పి.స్వప్న వాదించగా ఉద్యోగులు సహకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement