పెట్టుబడి కోసం పుస్తెలు సైతం తాకట్టు..
ఇప్పటికీ జమకాకపోవడంతో
రైతుల్లో ఆందోళన
ఖరీఫ్ ప్రారంభంతో
అరువు కోసం పరుగులు
పుస్తెలతాడు తాకట్టు పెట్టాం
ఇల్లెందురూరల్: గతేడాది రబీలో ఆరుతడి పంటగా రైతులు మొక్కజొన్న సాగు చేశారు. భూగర్భజలాలు సమృద్ధిగా ఉండటంతో దిగుబడి ఆశించిన మేర వచ్చింది. ప్రైవేట్ వ్యాపారులు మద్దతు ధర కంటే తక్కువ అడగడంతో రైతులు మక్కలను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో విక్రయించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా ఆ డబ్బులు మాత్రం సగం మందికి కూడా అందలేదు. దీంతో డబ్బులు అందని రైతుల్లో ఆందోళన నెలకొంది.
కొన్నది 1.96 లక్షల క్వింటాళ్లు
రాష్ట్రంలోనే ఇల్లెందు మండలంలో అత్యధికంగా 26 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. వాస్తవంగా యాసంగిలో మొక్కజొన్న పంట ఎకరాకు 40 క్వింటాళ్ల వరకు వస్తుంది. ఈ లెక్కన మండలంలో సాగైన 26 వేల ఎకరాల్లో 10.40లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. కానీ, ప్రభుత్వం ఎకరానికి 26 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రకటించి ఆ మేరకు మాత్రమే రైతుల నుంచి కొనుగోలు చేసింది. ఈ లెక్కన మండలంలో 6.76 లక్షల టన్నులు కొనుగోలు చేయాల్సి ఉంది. కానీ, మండలంలో పీఏసీఎస్ ఏర్పాటు చేసిన మూడు కొనుగోలు కేంద్రాలలో మొత్తంగా 1,96,348.5 క్వింటాళ్లు కొనుగోలు చేసింది. క్వింటాకు రూ.2,400 చొప్పున రూ.47.12 కోట్లు రైతుల ఖాతాల్లో జమకావాల్సి ఉంది.
సీజన్ ప్రారంభమైనా..
రబీలో పండిన మక్కలను ప్రభుత్వం ఏప్రిల్ నెల నుంచి కొనుగోలు చేయడం ప్రారంభించింది. సదరు మక్కలకు సంబంధించి డబ్బులు నేటికీ సగం మందికి కూడా అందలేదు. బహిరంగ మార్కెట్‌లో క్వింటా రూ.1,800లకు మాత్రమే వ్యాపారులు కొనుగోలు చేస్తుండటంతో మద్దతు ధర వస్తుందని అత్యధిక సంఖ్యలో రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయించారు. కానీ, ఇప్పటివరకు కొందిరికే డబ్బులు జమ అయినట్లు రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో విత్తనాలు, ఎరువుల పెట్టుబడికి అరువు కోసం పరుగులు తీస్తున్నారు. ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నా మూడు ఎకరాలకు పరిమితం కావడంతో రైతులకు తిప్పలు తప్పడం లేదు.
పుస్తెలు తాకట్టు పెట్టి..
కనీసం వంద ఎకరాలకు కూడా సాగునీరు అందించే చెరువులు లేకపోవడంతో రైతులు ఆకాశపాయ ఆధారంగా సాగు చేస్తుంటారు. ఈ కారణంగా రైతులు మొక్కజొన్న, పత్తి సాగుకు ప్రాధాన్యమిస్తుంటారు. గతేడాది వాతావరణం మక్కలకు అనుకూలంగా ఉండంటంతో రైతులు అత్యధిక విస్తీర్ణంలో సాగు చేశారు. దిగుబడి కూడా ఆశించిన స్థాయిలో రావడంతో ఆనందపడ్డారు. వీరిలో కౌలు, గిరిజనేతర రైతులు కూడా ఉన్నారు. అందరి మాదిరిగానే వీరు కూడా మద్దతు ధర లభిస్తుందన్న ఆశతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయించారు. కానీ, నేటికీ మక్కల డబ్బులు రాలేదు. అరువు అవస్థలు పడుతున్నారు. గతేడాది అప్పు ఇస్తే మరోసారి డబ్బులు ఇస్తామని వ్యాపారులు చెబుతుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. ఇక చేసేది లేక కొందరు రైతులు భార్య మెడలోని పుస్తెలతాడును బ్యాంకులు, ప్రైవేట్ వ్యాపారుల వద్ద తాకట్టు పెట్టి డబ్బులు సమీకరించుకొని విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తున్నారు.
2 ఎకరాల సొంత పొలంతోపాటు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకొని మొక్కజొన్న సాగు చేశాను. 200 క్వింటాళ్లు ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయించాను. నేటికీ డబ్బులు చేతికందలేదు. కౌలు రైతులకు ప్రభుత్వ రైతు భరోసా ఇవ్వడం లేదు. అప్పు పుట్టడంలేదు. అరువు ఇస్తలేరు. చేసేదిలేక పుస్తెలతాడు తాకట్టు పెట్టాను.
– నలమాసు దేవయ్య,
కౌలు రైతు, కొమరారం, ఇల్లెందు మండలం


