జూనోటిక్‌ వ్యాధులు ప్రమాదకరం | - | Sakshi
Sakshi News home page

జూనోటిక్‌ వ్యాధులు ప్రమాదకరం

Jul 6 2026 12:28 AM | Updated on Jul 6 2026 12:28 AM

సాధు జంతువుల నుంచి

వ్యాధుల సంక్రమణ

వైరస్‌, బ్యాక్టీరియా ద్వారా వ్యాప్తి

మరణాలకు దారి తీసే అవకాశం

జాగ్రత్తలు తప్పనిసరి

ఖమ్మంవ్యవసాయం: పశువుల నుంచి మానవులకు, మానవుల నుంచి పశువులకు సంక్రమించే స్వభావం కలిగిన వ్యాధులను జూనోటిక్‌ వ్యాధులు గా పిలుస్తారు. ప్రమాదకరమైన ఈ వ్యాధులు మరణాలకు కూడా దారితీస్తాయి. 1885 జూలై 6న శాస్త్రవేత్త లూయిస్‌ పాశ్చర్‌.. పిచ్చికుక్క కాటు వ్యాధి (రేబిస్‌) నివారణకు రూపొందించిన టీకాను ఓ బాలుడిపై ప్రయోగించి విజయం సాధించారు. అప్పటి నుంచి పెంపుడు జంతువులకు రేబిస్‌ వ్యాధి సోకకుండా ముందుగా యాంటీ రేబిస్‌ టీకా వేయ డం మొదలైంది. అంతేకాక ఏటా జూలై 6న ప్రపంచ జూనోసిస్‌ దినోత్సవంగా జరుపుకుంటున్నారు.

200 వ్యాధులు

జూనోటిక్‌ వ్యాధి కారణంగా మరో 200 వ్యాధులు కూడా సంక్రమిస్తాయని నిపుణులు గుర్తించారు. పాలు, మాంసం, గుడ్ల కోసం కోళ్లు, ఇతర జంతువులను పెంచుతుంటారు. మానసిక ఉల్లాసం కోసం కుక్కలను పెంచుతున్నారు. అయితే, పొలం పనులు చేసే రైతులు, జంతువుల తోళ్ల పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, వ్యాధులు సోకి చనిపోయిన జంతువుల మాంసాన్ని తినేవారు, పెంపుడు కుక్కలతో సన్నిహితంగా మెలిగే వారు జూనోటిక్‌ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. కాగా, సమయానికి వ్యాధిని గుర్తించలేకపోవడంతో జూనోటిక్‌ వ్యాధులను అరికట్టలేకపోతున్నారు.

వ్యాధులు, నివారణ చర్యలు

రేబిస్‌ (పిచ్చికుక్క కాటు వ్యాధి): ఇది పిచ్చికుక్క కాటు ద్వారా వ్యాప్తి చెందే భయంకరమైన వ్యాధి. కుక్క కరిచిన 7 – 10 రోజుల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. మనుషుల్లో ఈ వ్యాధిని హైడ్రోఫోబియా అంటారు. ఈ వ్యాధి సోకిన మనిషి గుటక వేయలేకపోగా, దాహం వేస్తున్నా నీళ్లు తాగమంటే భయపడతాడు. ఈ వ్యాధి నివారణకు కుక్క కరిచిన వెంటనే ఆ భాగాన్ని సబ్బుతో శుభ్రంగా కడగాలి. డాక్టర్‌ను సంప్రదించి చికిత్సచేయించుకోవాలి. పెంపు డు కుక్కలకు యాంటీ రేబిస్‌ టీకాలు వేయించాలి.

బర్డ్‌ఫ్లూ వ్యాధి: బర్డ్‌ ఫ్లూ లేదా ఇన్‌ఫ్లూయెంజా వ్యాధి కోళ్లు, ఇతర పక్షుల నుంచి వైరస్‌ మనుషుల్లోకి ప్రవేశించడం వల్ల వస్తుంది. పెంపకందారులు, షెడ్లలో పనిచేసే వారికి త్వరగా సోకుతుంది. అంతేకాక వ్యాధి సోకిన కోళ్లు, పక్షులు అకస్మాత్తుగా మరణిస్తాయి. వ్యాధి సోకిన మనుషుల్లో జలుబు, గొంతునొప్పి, దగ్గు, కండ్ల కలకలతో మొదలై ఊపిరితిత్తుల్లో రక్తం చేరి మరణానికి దారి తీస్తుంది. ఈ వ్యాధి నివారణకు కచ్చితమైన టీకా లేదు. టామిఫ్లూ వంటి వైరస్‌ నిరోధక మందులు వ్యాధి వ్యాప్తిని కొంతమేర అరికడతాయి.

నేడు ‘జూనోసిస్‌ డే’

జూనోటిక్‌ వ్యాధులు పశువులకు సోకకుండా వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. కుక్క లకు యాంటీ రేబిస్‌ టీకాలు వేయడం తప్పనిసరి. పెంపుడు జంతువులు, కోళ్లతో సన్నిహింతగా మెలిగే వారు జూనోటిక్‌ వ్యాధులపై అవగాహన పెంపొందించుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

–డాక్టర్‌ వి.అరుణ, సహాయ సంచాలకులు, ఖమ్మం పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాల

నేడు ఉచిత యాంటీ రేబిస్‌ టీకాల శిబిరం

ఖమ్మంమయూరిసెంటర్‌: ప్రపంచ జూనోసిస్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం పెంపుడు, వీధి కుక్కలకు యాంటీ రేబిస్‌ టీకాలు ఉచితంగా వేసేందుకు శిబిరం నిర్వహిస్తున్నట్లు ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు తెలిపారు. ‘యానిమల్స్‌ కేర్‌ సొసైటీ’ ఆధ్వర్యాన ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఖమ్మం రోటరీ నగర్‌లోని యానిమల్‌ బర్త్‌ కేర్‌ సెంటర్‌(ఏబీసీ)లో ఏర్పాటుచేసే ఈ శిబిరంలో పెంపుడు జంతువులకు టీకా వేయించాలని, వీధికుక్కలకు వ్యాక్సిన్‌ వేసేందుకు స్థానికులు సహకరించాలని కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement