కారణం తెలియాలి
డిప్యూటేషన్ వ్యక్తిగతమైతే
సింగరేణిలో లెక్కాపత్రం లేకుండా డిప్యూటేషన్లు
● క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టిన యాజమాన్యం ● వ్యక్తిగత విన్నపమైతే ఆర్థిక ప్రయోజనాల్లో కోత
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణి సంస్థ నిబంధనల ప్రకారం కఠినమైన పని పరిస్థితులు ఉండే భూగర్భ (యూజీ) గనుల నుంచి సర్ఫేస్ (ఉపరితల) పనులకు బదిలీలపై నిషేధం ఉంది. దీంతో భూగర్భ గనుల్లో పని చేసేందుకు సుముఖతలేని ఉద్యోగులు డిప్యూటేషన్‌పై సర్ఫేస్‌కు వస్తున్నారు. ఇందుకోసం రాజకీయ అండదండలు, పైరవీలు చేయడం పరిపాటిగా మారింది. మరోవైపు ఉపరితల గనుల్లో పని చేసే ఉద్యోగులు/కార్మికులకు యూజీల్లో కంటే ఎక్కువ మొత్తంలో అలవెన్సులు ఉన్నాయి. దీంతో ఇక్కడ ఖాళీలు ఉండటం లేదు. ఫలితంగా పైరవీ డిప్యూటేషన్లపై లెక్కకు మిక్కిలి సర్ఫేస్‌కు వస్తున్నారు. వారిని అంతగా ప్రాధాన్యత లేని విభాగాలు, బొగ్గు ఉత్పత్తిలో కీలకంగా లేని శాఖల్లోకి సర్దుబాటు చేయాల్సి వస్తోంది.. ఫలితంగా ఇటు ఓసీ, అటూ యూజీలలో కంటే సపోర్టింగ్ విభాగాల్లోనే అవసరానికి మించి పని చేస్తున్న ఉద్యోగులు/కార్మికుల సంఖ్య పెరిగిపోయింది. దీనికి తోడు ఇక సంస్థ ఆవల రాజకీయ నాయకులు దగ్గర వ్యక్తిగత సహాయకులుగా 50 మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నట్టు గుర్తించారు.
డిప్యూటేషన్లు ఎక్కువ
వ్యక్తిగత రిక్వెస్టులపైనే..
ప్రస్తుతం ఉన్న డిప్యూటేషన్లలో 80 శాతానికి పైగా సంస్థ అవసరాల కంటే వ్యక్తిగత రిక్వెస్టులపై జరిగినవే ఎక్కువ. కానీ, బాహ్య ఒత్తిళ్ల కారణంగా అన్ని డిప్యూటేషన్లు సంస్థ అవసరాల కోటా కిందే పరిగణనలో ఉన్నాయి. గడిచిన రెండు దశాబ్దాలుగా సింగరేణి సంస్థ ప్రతీ ఆర్థిక సంవత్సరంలో సాధించిన లాభాల్లో కొంత మొత్తాన్ని కార్మికులకు పంచుతోంది. అయితే, సింగరేణి అంటేనే బొగ్గు, అలాంటి బొగ్గు ఉత్పత్తితో నేరుగా సంబంధం లేకుండా ఉన్న వారికి బొగ్గు అమ్మకాల ద్వారా వచ్చిన లాభాల్లో వాటాలు ఇవ్వడం కఠిన పరిస్థితుల మధ్య భూగర్భ గనుల్లో పని చేసే కార్మికుల్లో అసంతృప్తికి కారణం అవుతోందనే వాదనలు ఉన్నాయి. ఓ వైపు సమర్థంగా మ్యాన్ పవర్‌ను వినియోగించుకుంటూనే, మరోసారి కార్మికుల శ్రమకు గుర్తింపు ఇచ్చే దిశగా సింగరేణి సిద్ధమైంది. అందులో భాగంగా సింగరేణిలో సులువైన పనిగా మారిన డిప్యూటేషన్లపై ఉక్కుపాదం మోపుతోంది.
లాభాల వాటాలో కోత
కొత్త మార్పులు – సంస్కరణలు అమల్లోకి వస్తే ప్రస్తుతం నిరవధికంగా కొనసాగుతున్న డిప్యూటేషన్ల పొడిగింపులు క్రమంగా తగ్గిపోతాయి. వాటికి ఎక్స్‌టెన్షన్ కావాలంటే కచ్చితమైన కారణం తెలపాలి. లేదంటే పర్సనల్ రిక్వెస్ట్ కింద పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడే సింగరేణి యాజమాన్యం అసలైన మెలిక పెడుతోంది. సంస్థ అవసరాల రీత్యా డిప్యూటేషన్‌పై ఉన్న వారికే లాభాల వాటా, దీపావళి బోనస్ అందించే విధంగా కొత్తగా సర్క్యులర్ జారీ చేసినట్టు సమాచారం. బొగ్గు ఉత్పత్తితో నేరుగా సంబంధం లేని విభాగాల్లో వ్యక్తిగత రిక్వెస్ట్‌ల మీద డిప్యూటేషన్‌పై వెళ్లిన ఉద్యోగులు/కార్మికులకు లాభాల బోనస్‌లో వాటాను నిరాకరించడమే అవుతుంది. అదే జరిగితే వ్యక్తిగత రిక్వెస్ట్ మీద లైట్ జాబ్‌లకు రావాలనుకునే ఉద్యోగులు/కార్మికులు లాభాల బోనస్, దీపావళి బోనస్ వంటి ఆర్థిక ప్రయోజనాలను వదులుకునేందుకు సిద్ధపడాల్సి ఉంటుంది.
ఇక మీదట డిప్యూటేషన్‌పై ఒక ఉద్యోగి/కార్మికుడిని పంపే ముందు అందుకు గల కారణాన్ని ప్రత్యేకంగా పేర్కొనాలి. సంస్థ అవసరాల దృష్ట్యా డిప్యూటేషన్ అవసరం పడిందా లేకా ఉద్యోగి రిక్వెస్ట్ మేరకు జరిగిందా అనే విషయాన్ని తేటతెల్లం చేయాలి. ఆర్నెళ్ల పరిమితి ముగిసిన తర్వాత తదుపరి ఎక్స్‌టెన్షన్ కోసం డైరెక్టర్ పా నుంచి అనుమతి తీసుకోవాలి. ఈ మేరకు ఏరియా జనరల్ మేనేజర్ స్థాయి నుంచి సంస్థ అవసరాల దృష్ట్యా డిప్యూటేషన్ అని ఫైల్ పెట్టినప్పటికీ, ఆ ఫైల్‌కు తగిన స్థాయిలో క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఉన్నాయా ? లేదా అన్న విషయాన్ని పరిశీలించిన తర్వాతే అనుమతి ఇవ్వడం లేదా నిరాకరించడం జరుగుతుంది. గరిష్టంగా ఏడాదికి మించి డిప్యూటేషన్ పొడిగింపు ఉండదు. ఎప్పటిలాగే ఒక ఏరియా నుంచి మరో ఏరియా డిప్యూటేషన్‌కు పా అనుమతి, సంస్థ ఆవల పని చేసేందుకు సీఎండీ అనుమతి తప్పనిసరి. అయితే, ప్రతీ సందర్భంలో డిప్యూటేషన్‌కు సంస్థ అవసరాలు కారణమా లేక ఉద్యోగి రిక్వెస్ట్ కారణమా అనేది కీలక అంశం కానుంది.


