ఏళ్లుగా ముందుకు సాగని జాతీయ రహదారి వంతెన ఫలితంగా పూర్తికాని గోదావరి కరకట్ట నిర్మాణం మళ్లీ వర్షాకాలం రావడంతో భద్రాచలం వాసులకు వరద భయం నేడు ఇరిగేషన్ ప్రాజెక్ట్, ఇతర సమస్యలపై మంత్రి ఉత్తమ్ సమీక్ష
భద్రాచలం: ఏళ్లు గడుస్తున్నా భద్రాచలం వద్ద కరకట్ట పొడిగింపు పనుల్లో జాతీయ రహదారిపై ఓవర్ బ్రిడ్జి.. నిర్మాణానికి నోచుకోవడంలేదు. ఇప్పటికే పలుమార్లు డిజైన్లు రూపొందించినా ప్రభుత్వం ఆమోదించలేదు. ప్రస్తుతం రూ.150 కోట్ల భారీ బడ్జెట్ అంచనాతో రూపొందించిన ప్రతిపాదనలను జాతీయ రహదారుల శాఖ అంగీకారం తెలిపింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉన్నతాధికారులతో ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇతర సమస్యలపై ఆ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి గురువారం హైదరాబాద్‌లో సమీక్ష జరపనున్నారు. పోలవరం ప్రాజెక్ట్ ముంపుతో ఇప్పటికే భద్రాచలంవాసులు భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఓవర్ బ్రిడ్జి సమస్యను సమీక్షించి నిధులు కేటాయించి, పూర్తిచేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
కరకట్టకు రూ.38 కోట్లు..,
ఓవర్ బ్రిడ్జికి రూ.150 కోట్లు
భద్రాచలం ముంపు కాలనీల ప్రజలను రక్షించేందుకు గోదావరి తీరం వెంబడి 2000 సంవత్సరంలో సుమారు 7.5 కిలోమీటర్ల పొడవున కరకట్ట నిర్మించారు. కూనవరం రోడ్డులో జాతీయ రహదారిపై ఓవర్ బ్రిడ్జి నిర్మించాల్సి రావడంతో సుమారు 700 మీటర్ల మేర కరకట్ట నిర్మాణం ఆగిపోయింది. 2022లో గోదావరి వరదలు తీర ప్రాంత కాలనీలను ముంచెత్తడంతో పాలకులు రూ.38 కోట్లతో కరకట్ట పొడగింపు పనులు చేపట్టారు. ఓవర్ బ్రిడ్జికి రూ.12 కోట్లను ప్రతిపాదించారు. కరకట్ట నిర్మాణం, స్లూయిస్, రిటైనింగ్ వాల్ తదితర పనులు ముగింపు దశకు వచ్చాయి. అయితే రూ.150 కోట్లతో ఓవర్ బ్రిడ్జి ప్లాన్‌ను జాతీయ రహదారుల శాఖ ఫైనల్ చేసింది. దీనిని ప్రభుత్వం ఆమోదిస్తేనే కరకట్ట పనులు పూర్తవుతాయి.
ఇరిగేషన్ అధికారులకు తలనొప్పి
పలు మార్లు డిజైన్లకు జాతీయ రహదారుల శాఖ అభ్యంతరం తెలుపుతుండగా, బ్రిడ్జి నిర్మాణంలో కాలయాపన సాగుతోంది. వర్షాకాలం సీజన్, గోదావరి వరదలు ముంచెత్తిన సందర్భంలో ప్రజాప్రతినిధులు, మంత్రులు ఆ శాఖ అధికారులకు చీవాట్లు పెడుతున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పలుమార్లు కరకట్ట నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలను సైతం జారీ చేశారు. కానీ నిర్మాణ ప్రక్రియ ముందుకు సాగడంలేదు. ఇరిగేషన్ అధికారులకు మాత్రం సమస్య తలనొప్పిగా మారింది.
జాతీయ రహదారి శాఖ ఆమోదించిన డిజైన్‌ను ప్రభుత్వానికి ప్రతిపాదించాం. ప్రభుత్వం నుంచి ఆమోదం వస్తే తిరిగి ఆ పనులను ప్రారంభించి పూర్తి చేస్తాం. అదేవిధంగా మా శాఖ పరిధిలో ఉన్న ప్రాజెక్టులు, ఇతర సమస్యలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశంలో ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేస్తాం.
–జాని, ఇరిగేషన్ ఈఈ, భద్రాచలం


