కమనీయంగా రామయ్య కల్యాణం | - | Sakshi
Sakshi News home page

కమనీయంగా రామయ్య కల్యాణం

Jun 11 2026 12:31 AM | Updated on Jun 11 2026 12:31 AM

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో మంగళవారం రామయ్య కల్యాణం కమనీయంగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. మంగళవారం సందర్భంగా అభయాంజనేయస్వామి ఉపాలయంలో అభిషేకం, తమల పాకులతో అర్చన జరిపారు.

ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షపాతంలో మార్పులు సంభవించే అవకాశం ఉందని, రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబూరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం లేదా వర్షాల్లో అంతరాలు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. రైతులు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ పంటల ఎంపిక చేసుకోవాలని సూచించారు. భూమిలో తగినంత తేమ ఏర్పడిన తర్వాత మాత్రమే విత్తనాలు విత్తాలన్నారు. వర్షాల ఆలస్యం లేదా తక్కువ వర్షపాతం పరిస్థితులు కొనసాగితే రైతులు తక్కువ కాలవ్యవధిలో పూర్తయ్యే, తక్కువ నీటి అవసరం ఉన్న ప్రత్యామ్నాయ పంటలైన కంది, పెసర, మినుము, జొన్న, సజ్జ, కొరల్రు, సామలు వంటి పంటల సాగును పరిశీలించాలని సూచించారు. వ్యవసాయ శాఖ, కృషి విజ్ఞాన కేంద్రాలు, వాతావరణ శాఖ సూచనలను అనుసరించాలని వివరించారు.

జేకే ఓసీ విస్తరణ

భూముల పరిశీలన

ఇల్లెందు: సింగరేణి ఇల్లెందు ఏరియాలోని జేకే ఓసీ విస్తరణకు ప్రతిపాదించిన 17.51 హెక్టార్ల అటవీ భూమి మళ్లింపు ప్రాంతాన్ని బుధవారం పర్యావరణ అటవీ వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ సమగ్ర ప్రాంతీయ కార్యాలయం అధికారి ఎస్‌.యువరాజ్‌ పరిశీలించారు. భూమి విస్తీర్ణం, ప్రాజెక్ట్‌ అవసరాలు, ప్రభావిత ప్రాంత వివరాలు, కుటుంబాల సంఖ్య తదితర వివరాలను ఇల్లెందు జీఎం వీసం కృష్ణయ్యను అడిగి తెలుసుకున్నారు. జేకే ఓసీ భవిష్యత్‌ అభివృద్ధి, ప్రాజెక్టు విస్తరణకు అవసరమైన అటవీభూమి మళ్లింపు, అనుమతుల ప్రక్రియపై అధికారులతో చర్చించారు. డీఎఫ్‌ఓ కృష్ణాగౌడ్‌, ఎఫ్‌డీఓ కరుణాకర్‌, ఎస్‌ఓటూ జీఎం బలరాం, ఇతర విభాగాల అధికారులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement