పినపాక: ఇష్ట దైవానికి మొక్కులు చెల్లించుకుని వస్తున్న యువకులు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. ఈ ఘటన మండలంలోని ఐలాపురం సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. మణుగూరు మండలం కమలాపురం గ్రామానికి చెందిన ధర్రాజు కిశోర్ (24), బట్ట ప్రశాంత్ (30) మండలంలోని గొట్టెల గ్రామంలోని దేవాలయానికి ద్విచక్రవాహనంపై వెళ్లారు. స్వామిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకుని తిరిగి వస్తుండగా.. ఐలాపురం సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. కిశోర్ అక్కడికక్కడే మృతిచెందగా.. ప్రశాంత్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. దేవుడి ఆశీస్సులు తీసుకుని వస్తారనుకుంటే దేవుడి దగ్గరికే వెళ్లారా.. అంటూ కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. ఎస్‌ఐ సురేశ్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి కారణమైన లారీడ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి


