అభయారణ్యంలో పెంచేందుకు దృష్టి
ఈ ఏడాది 400 హెక్టార్లలో 7 లక్షల వెదురు మొక్కలు నాటాలని లక్ష్యం
పాల్వంచరూరల్: అటవీశాఖకు ఆదాయం లభించే అవకాశాలు ఉన్నందును అభయారణ్యంలో వెదురు మొక్కలు పెంచేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. కిన్నెరసాని అభయారణ్యంలో ఈ ఏడాది 7 లక్షల మొక్కలను 400 పైన హైక్టార్ల విస్తీర్ణంలో పెంచాలని లక్ష్యంగా నిర్దేశించారు. అందులో భాగంగా ప్రస్తుతం నాలుగు లక్షలకుపైగా నాటాలని నిర్ణయించారు. అందుకోసం వైల్డ్‌లైఫ్‌కు చెందిన నాలుగు నర్సరీల్లో ఆ జాతి మొక్కలను పెంచుతున్నారు. వానలు కురిసిన తర్వాత వాటిని నిర్దేశించిన ప్రాంతాల్లో నాటేందుకు వైల్డ్‌లైఫ్ అధికారులు సన్నద్ధమవుతున్నారు.
ఆదాయం బాగు..
ఏజెన్సీ ప్రాంతంలో వెదురు సాగుకు అనుకూలం. గాలిలో తేమ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో వెదురు బాగా పెరుగుతుందని అటవీశాఖ అధికారులు అంటున్నారు. పంట భూముల్లో గట్టు చుట్టూ 4 మీటర్ల వెడల్పులో నాటుకోవాలి. 30/30 సెంటిమీటర్ల గుంతలను తీసుకుని 4 కేజీల పశువుల ఎరువు, మట్టి కలిపి గుంతలో నింపాలి. తర్వాత నాటిన మొక్కలు ఏడేళ్ల తర్వాత దిగుబడి వస్తుంది. వెదురు చివరి దశలో పూతకు వచ్చి విత్తనాలు ఇచ్చిన తర్వాత కుదురు చనిపోతుంది. నీటి సౌకర్యం ఉన్న చోట వేసవి కాలంలో నెలకోసారి తడిపెడితే దిగుబడి బాగుటుంది. ఎకరం విస్తీర్ణంలో 150 వెదురు కుదుళ్లు నాటుకోవచ్చు. ఏడేళ్ల తర్వాత 10 గెడల చొప్పున 1,500 గెడలు వస్తాయి. ఒక్కసారి నాటిన వెదురు చెట్టు కుదురు 20 నుంచి 25 ఏళ్లపాటు దిగుబడినిస్తాయి.
ఉపయోగాలు..
వెదురు పోయేసి సంతంతికి చెందిన గడ్డి జాతి మొ క్క. అత్యంత వేగంగా పెరిగే మొక్కల్లో ఇది ఒకటి. వెదురు విత్తనాలు మొక్కల కొమ్మల ద్వారా పండిస్తారు. జూన్, ఆగస్టు నెలల మధ్యలో నాటుతారు. వెదురు బొంగులతో ఇళ్లు, గుడిసెల నిర్మాణం, ఫర్నిచర్, కాగితం, బుట్టలు, హస్తకళల తయారీకి ఉపయోగపడుతుంది. వెదురు చెట్టు తన జీవిత కాలంలో 10 నుంచి 12 ఏళ్లకోమారు పూచే పూత కంకుల నుంచి లభించే గింజల్లో ఎన్నో ఔషధ గుణాలుంటాయని ఆయుర్వేదం చెబుతోంది. ఎముకల ఆరోగ్యానికి, జీర్ణక్రియకు, రక్తంలో చెక్కర నియంత్రణకు తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
అభయారణ్యంలో ఈ వానాకాలంలో నాలుగు వందల హెక్టార్లలో సుమారు ఐదు లక్షల వెదురు మొక్కలను నాటాలని నిర్ణయించాం. మరో రెండు వందల హెక్టార్లలో ఇతర కలపజాతుల మొక్కలను నాటుతున్నాం. వెదురు మొక్కలను నాలుగు నర్సరీల్లో పెంచుతున్నాం. వర్షాలు కురిసిన తర్వాత నాటుతాం.
–బి.బాబు, ఎఫ్‌డీఓ, వైల్డ్‌లైఫ్ పాల్వంచ డివిజన్


