● కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన సీపీఐ శ్రేణులు ● అడ్డుకున్న పోలీసులు, వాగ్వాదానికి దిగిన కార్యకర్తలు
సూపర్‌బజార్(కొత్తగూడెం) : పెంచిన ఇంధన ధరలు తగ్గించాలని, నిత్యావసరాల ధరలను పేదలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. జిల్లావ్యాప్తంగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. నేలపై పడుకొని నిరసన తెలిపారు. తొలుత ప్రధాన రహదారిపై భారీ ప్రదర్శన నిర్వహించారు. కార్యకర్తలు ప్రధాన ద్వారం నుంచి కలెక్టరేట్లోకి చొచ్చుకొని వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఈక్రమంలో తోపులాట, వాగ్వాదం నెలకొంది. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తంగా మారింది.
పేదల పొట్టకొడుతున్న కేంద్ర ప్రభుత్వం
ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ కేంద్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి వర్గాల పొట్టకొడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. తక్షణమే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా మాట్లాడుతూ అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నా, దేశంలో మాత్రం ఇంధన ధరలను పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మేయర్ మూడ్ గణేష్, నాయకులు కల్లూరి వెంకటేశ్వరరావు, నరాటి ప్రసాద్, సలిగంటి శ్రీనివాస్, సరెడ్డి పుల్లారెడ్డి, కె.సారయ్య, మున్నా లక్ష్మీకుమారి, చండ్ర నరేంద్ర కుమార్, వి.పూర్ణచందర్ రావు, జి.వీరాస్వామి, కంచర్ల జమలయ్య, కందుల భాస్కర్, రేసు ఎల్లయ్య, మువ్వా వెంకటేశ్వర్ రావు, భూక్యా దస్రు, యు.రాహుల్, ఎస్‌కే ఫహీమ్ పాల్గొన్నారు.
ఆదర్శప్రాయుడు కన్నయ్య
చర్ల : తుది శ్వాస వరకు ప్రజల సమస్యల కోసం పోరాడిన యోధుడు మచ్చా కన్నయ్య అని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే. సాబీర్ పాషా అన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వరరావు తండ్రి, సీపీఎం చర్ల సీనియర్ నాయకుడు మచ్చా కన్నయ్య ఇటీవల మృతి చెందాడు. బుధవారం చర్లలో కన్నయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి మాట్లాడారు. నయీమ్ ఖురేషీ, కల్లూరి వెంకటేశ్వరరావు, తాతాజీ తదితరులు ఉన్నారు.


