ఇల్లెందురూరల్: పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరుతూ ఉమ్మడి జిల్లా పెంకు పరిశ్రమల కార్మికులు మూడు రోజులుగా సమ్మె బాట పట్టారు. యజమానులు, తెలంగాణ టైల్స్ వర్కర్స్ యూనియన్ నేతల మధ్య బుధవారం పెంకు పరిశ్రమలో చర్చలు జరిగాయి. వేతనాల పెంపు విషయంలో ఇరు వర్గాల మధ్య అంగీకారం కుదరకపోవడంతో సమ్మె కొనసాగిస్తున్నట్లు యూనియన్ నేతలు ప్రకటించారు. ఈ సందర్భంగా న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి అశోక్ మాట్లాడుతూ.. చాలీచాలని వేతనాలతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కార్మికులకు వేతనాల పెంపు విషయంలో యజమానులు మొండిగా వ్యవహరించడం సరైంది కాదని పేర్కొన్నారు.
కలెక్టర్‌కు
మాజీ ఎమ్మెల్యే వినతి
భద్రాచలం: భద్రాచలం నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య కలెక్టర్ అంకిత్‌కు వినతిపత్రం అందించారు. బుధవారం ఆయన కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను కలిసి పలు అంశాలపై చర్చించారు. భద్రాచలం – వాజేడు ప్రధాన రహదారి మరమ్మతులు, నూతన రహదారి నిర్మాణ పనులను వర్షాకాలానికి ముందే చేపట్టాలని కోరారు. తాలిపేరు ప్రాజెక్టు పరిధిలోని రైతులకు సాగునీటి కాల్వల ద్వారా నీటిని అందించాలని, పోలవరం ప్రాజెక్టు నుంచి భద్రాచలానికి ముప్పు విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఇంకా ఏరియా ఆస్పత్రి, గోదావరి వరద, దుమ్ముగూడెం మండలానికి మంజూరైన విద్యుత్ సబ్‌స్టేషన్ పనులపై విన్నవించారు.
వడదెబ్బతో ఇద్దరు మృతి
మధిర: మధిర మండలం సిద్దినేనిగూడెం గ్రామానికి చెందిన శతాధిక వృద్ధుడు వడదెబ్బతో మృతి చెందాడు. గ్రామానికి చెందిన నెల్లూరు శ్రీరాములు(110) కొద్దిరోజులుగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో వడదెబ్బ బారిన పడ్డాడు. ఇంటి వద్దే ఆయనకు చికిత్స చేయిస్తుండగా పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందాడు. శ్రీరాములుకు నలుగురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.
పట్వారిగూడెంలో వృద్ధుడు..
దమ్మపేట: దమ్మపేట మండలం పట్వారిగూ డెం గ్రామానికి చెందిన వృద్ధుడు బండి రాఘవులు(70)వడదెబ్బతగిలి మృతిచెందాడు. కూలీ పనులు చేయలేక మూడు రోజులుగా భిక్షాటన చేస్తున్న ఆయన బుధవారం స్పృహ తప్పి పడిపోయాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేశామని అదనపు ఎస్‌ఐ బాలస్వామి తెలిపారు.
డివైడర్‌ను
ఢీకొని ఆటో బోల్తా
తలకు తీవ్ర గాయాలై డ్రైవర్ మృతి
బూర్గంపాడు: సారపాకలో ఆటో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. తలకు తీవ్రగాయాలైన ఆటోడ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందిన ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్‌ఐ ప్రసాద్ కథనం ప్రకారం.. సారపాక గాంధీనగర్‌కు చెందిన ఆటోడ్రైవర్ శివ (36).. మంగళవారం రాత్రి సారపాక ప్రధానకూడలి నుంచి ఐటీసీ ఈస్ట్‌గేట్ వైపునకు వెళ్తున్నాడు. ఆటో అదుపుతప్పి రోడ్డు మధ్యలోని డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. తీవ్రంగా గాయపడిన శివను స్థానికులు ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృడుడి తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.


