ఏజెన్సీ వైద్యంపై ప్రభుత్వానికి చిన్నచూపు | - | Sakshi
Sakshi News home page

ఏజెన్సీ వైద్యంపై ప్రభుత్వానికి చిన్నచూపు

Jun 11 2026 12:31 AM | Updated on Jun 11 2026 12:31 AM

భద్రాచలంఅర్బన్‌: నాలుగు రాష్ట్రాలకు పెద్దదిక్కుగా ఉన్న భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో మృతదేహాన్ని తరలించే వాహనం లేక భుజాలపై మోసుకుని వెళ్లడం చూస్తే ఏజెన్సీ వైద్యంపై ప్రభుత్వానికి ఉన్న వివక్ష తెలుస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ పేర్కొన్నారు. స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి ఈ ఆస్పత్రిని తనిఖీ చేసి ప్రజలకు అందుతున్న వైద్యాన్ని పరిశీలించాలని డిమాండ్‌ చేశారు. సీపీఎం రాష్ట్ర, జిల్లా నాయకులతో కలిసి బుధవారం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. అనంతరం ఇన్‌చార్జ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజశేఖర్‌రెడ్డితో చర్చించారు. ఆతర్వాత జాన్‌వెస్లీ విలేకరులతో మాట్లాడుతూ భద్రాచలం ఆస్పత్రికి ప్రతీతీ రోజు 400 – 600 మంది వస్తున్నా సరైన వైద్యం అందకపోగా, వైద్యులు, ఉద్యోగులు 212మందికి గాను 98మందే ఉండడం గర్హనీయమన్నారు. అత్యాధునిక వైద్య పరికరాలు ఉన్నా పూర్తిస్థాయిలో వైద్యులు లేక పేదలకు సేవలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, శానిటేషన్‌ కార్మికులకు రూ.26వేలకు బదులు కేవలం రూ.11వేల వేతనం, అది కూడా మూడు, నాలుగు నెలలకోసారి ఇస్తున్నారని చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సందర్శించిన దాఖలాలు లేవని విమర్శించారు. కాగా, రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యంపై సీపీఎం ఆధ్వర్యాన అధ్యయనం చేస్తున్నామని, ఇందులో గుర్తించిన సమస్యలపై ఆగస్టులో హైదరాబాద్‌లో నిర్వహించే బహిరంగ సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని జాన్‌వెస్లీ తెలిపారు. ఆయన వెంట సీపీఎం రాష్ట్ర, జిల్లా నాయకులు బండారు రవికుమార్‌, ఏ.జే.రమేష్‌, ఎం.బీ.నర్సారెడ్డి, గడ్డం స్వామి, బండారు శరత్‌ బాబు, సున్నం గంగ, ఎర్రంశెట్టి వెంకటరామారావు, సీతాలలక్ష్మి, ఇరుప అనసూర్య, లీలావతి, కొలగాని రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ

Advertisement
 
Advertisement
Advertisement