టేకులపల్లి: తల్లిదండ్రుల మరణం తర్వాత ఆస్తి పంచుకుందామని అడిగితే తమ్ముళ్లు తనతోపాటు తన భార్యపై దాడికి పాల్పడటమే కాకుండా చంపేస్తామని బెదిరిస్తున్నారని అన్న కన్నీటిపర్యంతమయ్యాడు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం రేగులతండాకు చెందిన మోహన్, మీనాక్షి దంపతులు వివరాలు వెల్లడించారు. 2021లో అమ్మ, 2025లో నాన్న మరణించాక భూమి, బంగారం, ఇతర ఆస్తులను పంచుకుందామని తమ్ముళ్లు శోభన్, సుమన్‌కు చెప్పారు. దీంతో వారు బెదిరింపులకు దిగడంతో గత ఏప్రిల్ 14న పోలీసులను ఆశ్రయించారు. అయినప్పటికీ తమ్ముళ్ల ప్రవర్తనలో మార్పు రాకపోగా వివాదాస్పద పొలాన్ని దున్నేందుకు వచ్చారు. మోహన్, మీనాక్షి దంపతులు అడ్డుకోవడంతో శోభన్, సుమన్ వారిని చితకబాదారు. దీంతో బాధితులు మే 30న పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత డీఎస్పీని కలిసి వినతిపత్రం ఇవ్వగా జూన్ 8న పోలీసులు శోభన్, సుమన్‌ను రిమాండ్ చేశారు. తర్వాత కూడా వారు వచ్చి చంపుతామని బెదిరిస్తున్నారని, వారితోపాటు గ్రామస్తులు కూడా కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారని మోహన్, మీనాక్షి కన్నీటిపర్యంతమయ్యారు. పోలీసు ఉన్నతాధికారులు న్యాయం చేయాలని వారు కోరారు.
రక్షించాలని అన్న వేడుకోలు..


