వేడెక్కిన ప్రచారం | - | Sakshi
Sakshi News home page

వేడెక్కిన ప్రచారం

Feb 7 2026 10:02 AM | Updated on Feb 7 2026 10:02 AM

వేడెక్కిన ప్రచారం

వేడెక్కిన ప్రచారం

డివిజన్లలో విస్తృతంగా పర్యటిస్తున్న నేతలు

జోరుగా పొంగులేటి, వద్దిరాజు, కూనంనేని ప్రచారం

చాపకింద నీరులా..

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం : మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. కాంగ్రెస్‌ తరఫున రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బీఆర్‌ఎస్‌ తరఫున ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, సీపీఐ నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రచారం చేస్తున్నారు.

భారమంతా పొంగులేటిపైనే..

కొత్తగూడెంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జి లేకపోవడం మైనస్‌గా మారింది. అభ్యర్థులంతా ఎవరికి వారుగా తమ డివిజన్ల వరకే పరిమితమయ్యారు. పైగా ఎన్నికల ఫలితాల తర్వాతే మేయర్‌ అభ్యర్థిని ఎంపిక చేస్తారనే ప్రచారం జరిగింది. దీంతో రిజర్వేషన్‌ ప్రకారం మేయర్‌ పదవి ఆశిస్తున్న అభ్యర్థులంతా పూర్తిగా గెలుపుపైనే దృష్టి సారించారు. ఫలితంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి కనిపించాల్సినంత ఊపు ప్రచారంలో లోపించింది. ఎట్టకేలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రచారం చేస్తుండటంతో పరిస్థితిలో మార్పు వస్తోంది. గురువారం కొత్తగూడెం కార్పొరేషన్‌ పరిధిలో ఆయన ప్రచారం నిర్వహించారు. సాధారణంగా మంత్రి పొంగులేటి బయటకు వస్తే ఇసుకేస్తే రాలనంత జనం తరలివస్తారు. కానీ, ఈ ఎన్నికల ప్రచారంలో ఆ జోష్‌ అయితే కనిపించలేదు. అయితే ఆ పరిస్థితిలో శుక్రవారం కొంత మార్పు కనిపించింది. ఇల్లెందు, పాల్వంచ మున్సిపాలిటీల్లో నిర్వహించిన ప్రచార సభలకు జనం భారీగానే తరలివచ్చారు.

గమ్యంలేని కారు ప్రయాణం

జిల్లాలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు బాధ్యతలను రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తీసుకున్నారు. వారం రోజులుగా ఆయన కొత్తగూడెంలోనే మకాం వేసి వ్యూహాలు రచిస్తున్నారు. కాళ్లకు చక్రాలు కట్టుకుని వాడవాడలా ప్రచారంలో తిరుగుతున్నారు. కానీ, పార్టీని ఒక్కతాటిపైకి తేలేకపోతున్నారనే అభిప్రాయం ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. కొత్తగూడెం నియోజకర్గంలో పట్టున్న వనమా కుటుంబాన్ని ఎన్నికల ప్రచారంలో పూర్తి స్థాయిలో ఉపయోగించలేకపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. వనమా ఇక్కడి నుంచే సర్పంచ్‌ నుంచి కేబినెట్‌ మంత్రి వరకు ఎదిగారు. కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్‌ ప్రాంతాల్లో వెంట నడిచే కేడర్‌ ఉంది. కానీ ప్రచారంలో వనమా కుటుంబాన్ని పూర్తి స్థాయిలో మమేకం చేయడంలో వద్దిరాజు వెనకబడ్డారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అంటీముట్టనట్టుగా రేగా..

మరోవైపు బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆరంభంలో కొత్తగూడెంపై ఆసక్తి చూపించినా, ఆ తర్వాత అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. గులాబీ పార్టీలో కీలక నేతల మధ్య సమన్వయ లేమి దీనికి కారణంగా తెలుస్తోంది. రాబోయే నాలుగైదు రోజులు కీలకం కాబట్టి, ఆ పార్టీకి చెందిన నాయకత్వమంతా ఒక్కతాటిపైకి వచ్చి శ్రమిస్తే అధికార పార్టీకి షాక్‌ ఇవ్వగలమనే నమ్మకం బీఆర్‌ఎస్‌ కేడర్‌లో కనిపిస్తోంది. ఇల్లెందులో మాజీ ఎమ్మెల్యే హరిప్రియా నాయక్‌ ఎన్నికల ప్రచారాన్ని ముందుండి నడిపిస్తున్నారు. అధికార కాంగ్రెస్‌ పార్టీకి చెక్‌ పెట్టేలా మిత్ర పక్షాలను కూడగట్టడంలో ఆమె సఫలమయ్యారు. మిత్రలాభం ఫలిస్తుందనే నమ్మకం ఇక్కడ కారు పార్టీ నేతల్లో కనిపిస్తోంది.

మున్సిపల్‌ కార్పొరేషన్‌ పీఠమే లక్ష్యంగా..

మిత్రపక్షమైన కాంగ్రెస్‌తో సీట్ల పంపకంలో తేడాలు రావడంతో సీపీఐ పార్టీ దాదాపు ఒంటరిగానే బరిలో దిగినట్టయింది. ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో ఈ పార్టీ పోటీ నామమాత్రమే అయినప్పటికీ కొత్తగూడెం కార్పొరేషన్‌ విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు దీటుగా ప్రచారంలో సీపీఐ శ్రేణులు ఉన్నాయి. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన మరుక్షణం నుంచే ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు వాల్‌ పోస్టర్లు, కరపత్రాలు, పాటలు, కళాజాతాలు ఇలా పూర్తి స్థాయి మెటీరియల్‌తో రంగంలోకి దిగారు. బహుజన, దళిత సంఘాలను సహకారం అందివ్వాల్సిందిగా కోరారు. కార్నర్‌ మీటింగుల్లో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొంటున్నారు. గెలుపు కోసం శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తామని కామ్రేడ్లు అంటున్నారు. బీజేపీ సైతం గతానికి భిన్నంగా ఎక్కువ స్థానాల్లో పోటీలో దిగింది. పోటీ చేసే అవకాశం కొత్త తరానికి ఇచ్చింది. ఈ ప్రయోగం ఫలిస్తే పురపాలనలో కమలం మార్క్‌ మొదలవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement