ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్
కలెక్టర్ జితేష్ వి.పాటిల్
సూపర్‌బజార్(కొత్తగూడెం): మున్సిపల్ ఎన్నికల్లో విధులు నిర్వహించే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. శుక్రవారం ఆయన వివరాలు వెల్లడించారు. అశ్వారావుపేట, ఇల్లెందు, కొత్తగూడెంలలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 7, 8 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. దీనికోసం ఎన్నికల విధుల ఉత్తర్వు ప్రతి, ఉద్యోగ గుర్తింపు కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫొటో తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు. నిర్ణీత తేదీల్లో అందరూ వ్యక్తిగతంగా హాజరై తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
బొగ్గు నాణ్యతకే ప్రాధాన్యం
మణుగూరు రూరల్: బొగ్గు నాణ్యతకు ప్రాధాన్యమివ్వాలని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(కోల్ మూవ్‌మెంట్), చీఫ్ విజిలెన్స్ అధికారి బి.వెంకన్న జాదవ్ అన్నారు. శుక్రవారం ఆయన సింగరేణి మణుగూరు ఏరియాలో నిర్వహించిన అధికారుల సమావేశంలో మాట్లాడారు. ప్రైవేట్ కంపెనీలు, విదేశీ బొగ్గు నుంచి పెరుగుతున్న పోటీని తట్టుకోవాలంటే నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. జీ–13 కంటే మెరుగైన నాణ్యత కలిగిన బొగ్గును మాత్రమే సరఫరా చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. జీఎంలు దుర్గం రామచందర్, టి.శ్రీనివాస్, ఎ.రవికుమార్, జె.వెంకటరమణ, ఇతర అధికారులు శ్రీనివాసచారి, వెంకటరామారావు, రాంబాబు, శ్రీనివాస్, రమేష్, శ్రీనివాస్, వేణుమాధవ్, ఎస్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
రాజకీయాల్లో యువత భాగస్వామ్యం ఉండాలి
అశ్వారావుపేటరూరల్: రాజకీయాల్లో యువత భాగస్వామ్యం అవసరమని, యువత చేతిలోనే దేశ భవిష్యత్ ఉంటుందని రాస్ట్రీయ లోక్‌దళ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ అన్నారు. శుక్రవారం అశ్వారావుపేటలోని ఆ పార్టీ కార్యదర్శి వెలుగు జాకబ్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి 15 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని, వీరిలో అశ్వారావుపేటలో ముగ్గురు అభ్యర్థులు ఉన్నారని తెలిపారు. ఫుట్‌బాల్ గుర్తుపై ఓటేసి, తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని మించి కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి హెచ్చుమీరిందని విమర్శించారు. విద్య, వైద్య, ఉపాధి రంగాలు దారుణంగా దెబ్బతిన్నాయని అన్నారు. అశ్వారావుపేట వంటి గిరిజన ప్రాంతాలకు నిధుల కేటాయింపులు లేవన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వంటి అసమర్థ సీఎంను తన రాజకీయ జీవితంలో చూడలేదని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోమటిరెడ్డి గోపాల్‌రెడ్డి, రాష్ట్ర యూత్ అధ్యక్షుడు రాజ్ కుమార్ రెడ్డి, గౌర బీరప్ప, గిరికుండే, కట్టా సతీష్, మడకం ప్రసాద్, యాగంపూడి ప్రసాద్ పాల్గొన్నారు.
రేపటి నుంచి
సీఎం కప్ పోటీలు
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 8 నుంచి అసెంబ్లీ, జిల్లాస్థాయి సీఎం కప్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా అధికారి పరంధామరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాస్థాయి క్రీడల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 8 నుంచి 10 వరకు అసెంబ్లీస్థాయి, 8 నుంచి 14వ తేదీ వరకు జిల్లాస్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అసెంబ్లీస్థాయి వాలీబాల్, చెస్, క్యారమ్ పోటీలను ప్రకాశం స్టేడియంలో, బ్యాడ్మింటన్ పోటీలు కొత్తగూడెం హనుమాన్ బస్తీలో, కబడ్డీ, ఖోఖో పోటీలు ప్రకాశం స్టేడియంలో, అఽథ్లెటిక్స్ పాల్వంచలోని శ్రీనివాసకాలనీ మినీ స్టేడియంలో, ఫుట్‌బాల్ కేటీపీఎస్ ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో నిర్వహిస్తామని వివరించారు. జిల్లాస్థాయి నెట్‌బాల్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్ పోటీలు ప్రకాశం స్టేడియంలో, సైక్లింగ్ ఇల్లెందు క్రాస్‌రోడ్‌లో, బాల్ బ్యాడ్మింటన్, సాఫ్ట్‌బాల్, తైక్వాండో. యోగా, కరాటే తదితర పోటీలు ప్రకాశం స్టేడియంలో, హాకీ శ్రీరామచంద్ర కాలేజీలో, కిక్ బాక్సింగ్, స్విమ్మింగ్, రెజ్లింగ్, ఉషూ కొత్తగూడెం సీఈఆర్ క్లబ్‌లో, రెఫిల్ షూటింగ్ శ్రీ రామచంద్ర కాలేజీలో, వీల్‌చైర్ క్రికెట్, నెట్ క్రికెట్, ప్రగతిమైదాన్‌లో నిర్వహిస్తామని వెల్లడించారు.


