ఇల్లు, ఇంటి స్థలం ఇస్తాం | - | Sakshi
Sakshi News home page

ఇల్లు, ఇంటి స్థలం ఇస్తాం

Feb 7 2026 10:02 AM | Updated on Feb 7 2026 10:02 AM

ఇల్లు, ఇంటి స్థలం ఇస్తాం

ఇల్లు, ఇంటి స్థలం ఇస్తాం

పాల్వంచలో 817 సర్వే నంబర్‌ సమస్య పరిష్కరిస్తాం

సింగరేణి స్థలాల్లో నివాసం ఉండేవారికి హక్కులు..

రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి

ఇల్లెందు/పాల్వంచరూరల్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో గెలిపించే బాధ్యత మీది.. అభివృద్ధి చేసే బాధ్యత మాది అని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొత్తగూడెం కార్పొరేషన్‌లోని పాత పాల్వంచ అంబేద్కర్‌ సెంటర్‌, నటరాజ్‌ సెంటర్‌, శ్రీనివాస కాలనీ, వెంగళరావు కాలనీల్లో జరిగిన కార్నర్‌ మీటింగ్‌ల్లో, మండల పరిధి లక్ష్మీదేవిపల్లి పంచాయతీ కొమరంభీమ్‌ భవనంలో, ఇల్లెందులోని జగదాంబా సెంటర్‌లో నిర్వహించిన సభల్లో మాట్లాడారు. ఇల్లెందు సభకు వచ్చిన జనసందోహాన్ని చూస్తే, ఇక ప్రతిపక్ష పార్టీ ఒక్క వార్డు అయినా గెలుస్తుందో, లేదోననే అనుమానం వస్తోందని అన్నారు. ఇల్లెందులో 100 పడకల ఆస్పత్రి, మినీ స్టేడియం, బుగ్గవాగు ప్రక్షాళన, అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీ, ఏటీసీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కుల సంఘాల భవనాలు కూడా నిర్మిస్తామని చెప్పారు. దివంగత మాజీ సీఎం డాక్టర్‌ వైఎస్సార్‌ జీఓ నంబర్‌ 76 ద్వారా సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్నవారికి హక్కులు కల్పించారని, అదే జీఓ ద్వారా అర్హులకు హక్కు పత్రాలు అందిస్తామని వివరించారు. త్వరలో పూసపల్లి ఓసీ చేపడుతామని తెలిపారు. అధికారంలోలేని వారికి ఓట్లు వేస్తే అభివృద్ధి జరగదని, కాంగ్రెస్‌తోపాటు మిత్రపక్ష పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్పొరేషన్‌లో ప్రతీ డివిజన్‌కు రూ.50 లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తామన్నారు.

817 సర్వే నంబర్‌ సమస్య పరిష్కరిస్తాం

పాల్వంచ పట్టణ ప్రజలను అనేక సంవత్సరాలుగా వేధిస్తున్న 817 సర్వే నంబర్‌ సమస్యను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సర్వే నిర్వహించి అందరికీ హక్కులు కల్పిస్తామన్నారు. ఇళ్ల మధ్య హైటెన్షన్‌ తీగలు లేకుండా చర్యలు తీసుకుంటామని, పాల్వంచను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. 4, 5, 6, 7 డి విజన్ల అభ్యర్థులు శ్రీలత, సర్వమ్మ, డాక్టర్‌ బీఎస్‌ రావు, సుజాతమ్మలను గెలిపించాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కోరం కనకయ్య, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు తోట దేవీ ప్రసన్న, ఇల్లెందు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బానోతు రాంబాబు, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌లు దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, యదళ్లపల్లి అనసూర్య, నాయకులు బాలసాని లక్ష్మీనారాయణ, ఆయితం గంగాధర్‌, నాగా సీతారాములు, కొత్వాల శ్రీనివాసరావు, వూకంటి గోపాలరావు, తుళ్లూరి బ్రహ్మయ్య, నూకల రంగారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement