‘రిజిస్ట్రేషన్’లో తర్జనభర్జన!
ప్రస్తుతానికి అద్దె భవనాల్లోనే..
అద్దె భవనాలను ఖాళీ చేయాలని ప్రభుత్వ ఆదేశాలు
బూర్గంపాడు, ఇల్లెందులో
మార్పునకు ఓకే
మిగతా చోట్ల అందుబాటులోలేని ప్రభుత్వ భవనాలు
సందిగ్ధంలో జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు
ఖమ్మంమయూరిసెంటర్: ఆర్థిక భారం తగ్గించుకునేందుకు అద్దె భవనాల్లోని కార్యాలయాలను ప్రభు త్వ భవనాల్లోకి మార్చాలని సర్కారు నిర్ణయించింది. ఈ క్రమంలోనే జిల్లా రిజిస్ట్రార్, చిట్, మార్కెట్ వ్యాల్యూ అధికారుల కార్యాలయాలు, సబ్ రిజి స్ట్రార్ కార్యాలయాలను ప్రభుత్వ భవనాల్లోకి మా ర్చాలని రిజిస్ట్రేషన్‌శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అద్దె భవనాల్లో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రభుత్వ భవనాల్లోకి మార్చేందుకు ఇక్కడి అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. గత నెల 25వ తేదీ నాటికే అద్దె భవనాలు ఖాళీ చేయాలని ఆదేశించినా సరిపడా భవనాలు లేకపోవడంతో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఒకటి, రెండు కార్యాలయాలకు మాత్రం భవనాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని త్వ రలోనే మార్చనున్నట్లు అధికారులు వెల్లడించారు.
బూర్గంపాడు, ఇల్లెందుల్లో మాత్రమే
అందుబాటులో..
జిల్లాలో ఖమ్మం రిజిస్ట్రార్ కార్యాలయంతోపాటు 11 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో మధి ర, సత్తుపల్లి, భద్రాచలం, కొత్తగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఇప్పటికే ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతున్నాయి. ఖమ్మం జాయింట్ సబ్ రిజిస్ట్రార్, కూసుమంచి, ఖమ్మంరూరల్, వైరా, కల్లూరు, ఇల్లెందు, బూర్గంపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. వీటి కోసం అధికారులు ప్రభుత్వ భవనాలను వెతకగా, బూర్గంపాడు, ఇల్లెందుల్లో మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలిసింది. రెండింటిని త్వరలోనే ఆయా భవనాల్లోకి మార్చనున్నట్లు సమాచారం.
శంకుస్థాపన చేసినా..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు గత ప్రభుత్వం స్థలాలు కేటాయించి శంకుస్థాపనలు చేసింది. నిర్మాణాలు మాత్రం చేపట్టలేదు. వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి 2016, జూన్ 12న శంకుస్థాపన చేశారు. పదేళ్లు అవుతున్నా నిర్మాణం ముందుకు సాగడం లేదు. జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంతోపాటు ఖమ్మం, ఖమ్మంరూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఖమ్మంరూరల్ మండలంలోని పోలేపల్లి వద్ద స్థలం కేటాయించింది. నిధులు మంజూరు చేయకపోవడంతో భవన నిర్మాణాలు చేపట్టలేదు. వైరా, జిల్లారిజిస్ట్రార్ కార్యాలయం, ఖమ్మం, ఖమ్మంరూరల్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు నిధుల లేమితో సొంత భవనాలకు నోచుకోలేదు.
ఇంటిగ్రేటెడ్ భవన నిర్మాణానికి ప్రతిపాదనలు
ఖమ్మంరూరల్ మండలంలోని పోలేపల్లి వద్ద రిజిస్ట్రేషన్ శాఖకు కేటాయించిన స్థలంలో కార్యాలయాల కోసం ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ భవనం నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదించినట్లు సమాచారం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లామని అధికారులు చెబుతున్నారు.
ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేని సబ్ రిజి స్ట్రార్ కార్యాలయాలను అద్దె భవనాల్లోనే కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం ఆర్‌ఓ–జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మా ర్చాలంటే ఎనిమిది గదులు, ఐదు పెద్దహాళ్లు, స్టోర్‌కు మరో నాలుగైదు గదులు ఉన్న భవనం అవసరం ఉంటుంది. దీంతో కార్యాలయ భవనం మార్పునకు అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఇక వైరా, కల్లూరు, ఖమ్మంరూరల్, కూసుమంచి కార్యాలయాలకు భవనాలు అందుబాటులో లేకపోవడంతో ప్రస్తుతం ఉన్న వాటిలో కొనసాగించే యోచనలో ఉన్నారు. అయితే యజమానులు అద్దె లేకుండా కార్యాలయాలకు భవనాలు ఇస్తే కొనసాగిస్తామని చెబుతుండడం గమనార్హం.


