అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలి
గుండాల: మండలాభివృద్ధిలో అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు, ప్రజలు భాగస్వామ్యం కావాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. యాస్పిరేషన్ బ్లాక్‌గా గుర్తించిన గుండాలలో గురువారం సంపూర్ణతా అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాళ్లను పరిశీలించారు. మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ గ్రామాల్లో టీబీ జబ్బులు రాకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి, రక్త నమూనాలు సేకరించాలని వైద్యాధికారులను సూచించారు. సర్పంచులు అంగన్‌వాడీ కేంద్రాలను, పాఠశాలలను సందర్శించి వసతులను పరిశీలించాలని సూచించారు. పశువులను పరిశీలించి, గ్రామాల్లో పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేయాలని పశువైద్యాధికారులకు సూచించారు. తక్కువ కాలంలో అధిక లాభాలను అందించే మునగ, ఆకుకూరలను సాగు చేసుకోవాలని రైతులకు చెప్పారు. యువతకు ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 14 వరకు కొనసాగుతుందని అప్పటి వరకు వందశాతం అభివృద్ధి సాధించాలన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు
ప్రత్యేక చర్యలు చేపట్టాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖలు సమన్వయంతో ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి గురువారం సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన జిల్లా స్థాయి రహదారి భద్రతా కమిటీ సమావేశంలో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా జనవరిలో 49 రోడ్డు ప్రమాదాలు జరగగా 17 మంది మృతి చెందినట్లు తెలిపారు. ప్రమాదాలు జరిగిన ప్రదేశాలను గుర్తించి, అవసరమైన నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రహదారుల మరమ్మతులకు రోడ్డు రిపేర్ గ్యాంగ్‌ను ఏర్పాటు చేయాలనానరు. బ్లడ్ బ్యాంక్‌లో రక్త నిల్వలపై క్రమం తప్పకుండా నివేదికలు అందించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా సమగ్ర ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ ప్లాన్ రూపొందించాలని అన్నారు. ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 38 బ్లాక్ స్పాట్లు, 62 ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రదేశాలను గుర్తించినట్లు వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లో భద్రతా చర్యలు అమలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో అధికారులు నాగలక్ష్మి, తుకారాం, సంజీవరావు, స్వర్ణలత లెనినా, వెంకటేశ్వరావు, మంగతార, నాగేశ్వరరావు, గుండాల తహశీల్దార్ ఖాసీం, ఎంపీడీఓ బాలస్వామి, వైద్యాధికారి మనేష్‌రెడ్డి, సుదీప్, సర్పంచులు, ఆశాలు, అంగన్‌వాడీ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
ఈవీఎం గోదాం తనిఖీ
కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో గురువారం ఈవీఎం గోదాంను కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నెలా గోదాంను తనిఖీ చేస్తామని తెలిపారు. సీసీ కెమెరాల పనితీరు, పరిసరాలను పరిశీలించారు. అనుమతి లేనిదే ఎవరినీ లోపలికి అనుమతించొద్దని అధికారులను ఆదేశించారు. అనంతరం తనిఖీ రిజిస్టర్‌లో సంతకం చేశారు. కలెక్టర్ వెంట ఎన్నికల సూపరింటెండెంట్ రంగ ప్రసాద్, ఎన్నికల సిబ్బంది నవీన్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి.పాటిల్


