ప్రేమ, ఆప్యాయత వెల్లి విరియాలి
● డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
మధిర: రాష్ట్రమంతా ప్రేమ, ఆప్యాయతలు వెల్లివిరియాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఏసుప్రభువును ప్రార్థించినట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. మధిరలోని బయ్యారం చర్చిలో బుధవారం అర్ధరాత్రి నుంచి మొదలైన ప్రత్యేక ప్రార్థనలకు ఆయన హాజరయ్యారు. చర్చి నిర్మించి 125ఏళ్లు గడిచిన సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం భట్టి మాట్లాడారు. అందరికీ మంచి జరగాలని ప్రార్థించినట్లు తెలిపారు. అయితే, ప్రభువు సందేశం ఇచ్చినట్లుగా ప్రతీఒక్కరు ఇతరులకు అండగా నిలవాలని, పరస్పరం సహాయ సహకారాలు ఇచ్చిపుచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చర్చి బాధ్యులు, మత పెద్దలు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
28న జిల్లాస్థాయి
క్రాస్ కంట్రీ ఎంపికలు
ఖమ్మంస్పోర్ట్స్: ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో జిల్లా స్థాయి క్రాస్ కంట్రీ ఎంపిక పోటీలు ఈనెల 28న నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మందుల వెంకటేశ్వర్లు, షఫీక్ అహ్మద్ తెలిపారు. అండర్–16, 18, 20 బాలబాలికల విభాగాల్లో పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. అండర్ –16 బాలబాలికలకు 2 కిలోమీటర్లు, అండర్–18లో బాలురకు ఆరు, బాలికలకు నాలుగు కి.మీ., అండర్–20 విభాగంలో బాలురకు ఎనిమిది కి.మీ., బాలికలకు ఆరు కి.మీ., మహిళలు, పురుషులకు 10 కి.మీ. క్రాస్ కంట్రీ ఉంటుందని తెలిపారు. ఆసక్తి కలిగిన క్రీడాకారులు ఈనెల 28 ఉదయం 10 గంటలకల్లా స్టేడియంలో రిపోర్టు చేయాలని సూచించారు.
చర్చి నిర్మాణానికి
రూ.2లక్షల విరాళం
రఘునాథపాలెం: క్రిస్‌మస్ పండుగను పురస్కరించుకుని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చర్చి నిర్మాణానికి గురువారం విరాళం అందజేశారు. ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసిన ఆయన క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రఘునాథపాలెం మండలం మంచుకొండలో నిర్మించే చర్చికి రూ.2లక్షల విరాళం అందించగా మతపెద్దలు పువ్వాడకు కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్ శంకర్, నాయకులు పాల్గొన్నారు.
పేకాట శిబిరంపై దాడి
దమ్మపేట : మండల పరిధిలోని నాగుపల్లి గ్రామ శివారులో ఉన్న ఓ వ్యవసాయ క్షేత్రంలో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు గురువారం దాడి చేశారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా మరో నలుగురు పరారయ్యారు. రెండు ద్విచక్ర వాహనాలు, రూ.4,900 నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని ఎస్సై సాయికిషోర్ రెడ్డి తెలిపారు.
బాలుడి మృతదేహం కోసం గాలింపు
ఖమ్మంక్రైం: సాగర్ కాల్వలో బుధవారం గల్లంతైన బాలుడు శశాంక్ మృతదేహం ఇంకా లభించలేదు. కాల్వలోని మూడుచోట్ల పోలీసులు గాలించినా మృతదేహం కనిపించకపోవటంతో లోపల ఏదైనా రాయికి చిక్కుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. దీంతో బాలుడి తల్లిదండ్రుల కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. శశాంక్ తోపాటు గల్లంతైన మరో బాలుడు సుహాన్ మృతదేహం బుధవారమే లభ్యమైన విషయం విదితమే.
ప్రేమ, ఆప్యాయత వెల్లి విరియాలి


