సింగరేణికి దక్కేనా..?
● మణుగూరు ఏరియాలో పీకే ఓసీ–2 డీప్ సైడ్ బ్లాక్ వేలంపై ఉత్కంఠ ● ఆశగా ఎదురుచూస్తున్న కార్మికులు, పరిసర ప్రాంతాల ప్రజలు
మణుగూరు మనుగడ కొనసాగాలంటే పీకేఓసీ–2 డీప్ సైడ్ బ్లాక్ వేలంలో సింగరేణికే దక్కాలి. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బ్లాక్ సింగరేణికి దక్కేలా చూడాలి. –వై.రాంగోపాల్,
ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి
మణుగూరు భవిష్యత్, వేలాది కార్మికుల జీవనోపాధితో ముడిపడి ఉన్న పీకేఓసీ–2 డీప్‌సైడ్ బ్లాక్‌ను సింగరేణికే అప్పగించాలి. వేలంలో సింగరేణితో పాటు విద్యుత్ సంస్థ మాత్రమే పాల్గొంటోంది. ప్రభుత్వం చొరవ చూపాలి.
–కృష్ణంరాజు, ఐఎన్‌టీయూసీ వైస్ ప్రెసిడెంట్
మణుగూరు టౌన్: సింగరేణి మణుగూరు ఏరియా భవిష్యత్‌పై సర్వత్రా చర్చ మొదలైంది. కొద్దిరోజుల్లో పీకే ఓసీ–2 దిగువ భాగం వేలం నిర్వహించనుండగా, కార్మికులు, పరిసర ప్రాంతాల ప్రజలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. సింగరేణి వ్యాప్తంగా మణుగూరు ఏరియాలోనే అధికంగా బొగ్గు ఉత్పత్తి అవుతోంది. ఇక్కడ ఒక భూగర్భగని, రెండు ఓపెన్‌కాస్ట్‌లు ఉండగా, పీకే ఓసీలోని అంతర్భాగమైన పీకేఓసీ–2 ఉత్పత్తిలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. గనిలో ఏటా 10 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తుండగా, అందులో 6 మిలియన్ టన్నులు పీకేఓసీ–2 నుంచే వెలికితీస్తున్నారు. ఇక్కడ సుమారు 55 మిలియన్ టన్నుల నిక్షేపాలు మాత్రమే ఉన్నాయి. మరో నాలుగున్నరేళ్లలో నిల్వలు అడుగంటుతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. 2030 తర్వాత ఏరియా మనుగడ కొనసాగాలంటే పీకేఓసీ–2 డీప్ సైడ్ బ్లాక్ సింగరేణికి దక్కాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. తాజాగా బొగ్గు బ్లాకుల వేలానికి దరఖాస్తు గడువు ముగియగా, సింగరేణితోపాటు మరొక కంపెనీ దరఖాస్తు చేసుకుంది. జనవరి రెండో వారంలోగా వేలం వేయనున్నారు. బ్లాక్‌లో 115 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలుండగా, జీవిత కాలం 20 ఏళ్లు ఉండే అవకాశం ఉంది. దీంతో సమీప ప్రాంతాల అభివృద్ధి, స్థానికులకు ఉపాధి, కార్మికుల స్థిరీకరణతో అభివృద్ధి జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, సింగరేణి, స్థానిక ఎమ్మెల్యేలు చొరవ తీసుకుని ఏరియా బొగ్గు బ్లాక్ దక్కేలా కృషి చేయాలని కార్మిక నాయకులు, స్థానికులు కోరుతున్నారు.
సింగరేణికి దక్కేనా..?
సింగరేణికి దక్కేనా..?


