
సమస్యలు సత్వరమే పరిష్కరించాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): సమస్యల పరిష్కారానికి ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులపై ఆయా శాఖల అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందనతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వాటిని పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల్లో కొన్ని..
● జూలూరుపాడు మండలం కొమ్ముగూడెంలో గతంలో నిర్మించిన పశువుల ఆస్పత్రి శిథిలావస్థకు చేరిందని, పశు వైద్యానికి ఇబ్బందిగా ఉందని, నూతన భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని స్థానికులు దరఖాస్తు చేయగా పశుసంవర్థక శాఖాధికారికి ఎండార్స్ చేశారు.
● బూర్గంపాడు మండలం చింతకుంటలో 37 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని, ప్రధాన రహదారి నుంచి గ్రామానికి సరైన రోడ్డు లేదని, తాగునీటి సమస్య ఉందని, చిన్నపిల్లలకు అంగన్‌వాడీ పాఠశాల లేదని, విద్యుత్ సౌకర్యం కూడా లేదని గ్రామస్తులు చేసిన దరఖాస్తును తగిన చర్యల నిమిత్తం కలెక్టరేట్ డీ సెక్షన్ సూపరింటెండెంట్‌కు ఎండార్స్ చేశారు.
● స్థానిక సంస్థల ఎన్నికలలో ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని, ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని మాదిగ జేఏసీ రాష్ట్ర సెక్రటరీ మోదుగు జోగారావు, బహుజన సంఘాల జిల్లా కన్వీనర్ వేల్పుల నరసింహారావు దరఖాస్తు చేశారు.
● రేషన్ డీలర్లకు ఐదు నెలల కమీషన్ అందించాలని, లేదంటే సెప్టెంబర్ 5 నుంచి సమ్మె చేస్తామని రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఊకే శేఖర్‌రావు వినతిపత్రం అందించారు.
ప్రజావాణిలో అదనపు కలెక్టర్
వేణుగోపాల్