
సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
భద్రాచలం: గిరిజనాభివృద్ధి కోసం ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. ఐటీడీఏ సమావేశం మందిరంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్‌లో ఆయన వినతులు స్వీకరించి, పరిష్కారానికి సంబంధిత అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అర్హతల మేరకు దరఖాస్తులను వెంటనే పరిష్కరించేలా అధి కారులు కృషిచేయాలని సూచించారు. స్వయం ఉపాధి, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు స్థాపించుకుని అర్థికాభివృద్ధి సాధించాలని గిరిజనులను కోరారు. సోలార్ ద్వారా బోరు బావులు తవ్వించాలని, రాజీవ్ యువ వికాసం ద్వారా రుణాలు ఇప్పించాలని, పోడు భూముల సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, గిరిజన గ్రామాల్లో రోడ్డు సౌకర్యం తదితర సమస్యలపై దరఖాస్తులు అందించారు. కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్ రాజ్, ఏఓ రాంబాబు, డీడీ మణెమ్మ, గురుకులాల ఆర్‌సీఓ అరుణకుమారి, ఈఈ హరీష్, ఏడీఎంహెచ్‌ఓ సైదులు, ఎస్‌ఓ భాస్కరన్, ఉద్యానవనాధికారి ఉదయ్‌కుమార్, ఏపీఓ వేణు, లింగానాయక్, రాజారావు పాల్గొన్నారు.
గిరిజన విద్యార్థులకు అభినందన..
వివిధ అంశాల్లో రాణిస్తున్న గిరిజన విద్యార్థులను పీఓ రాహుల్ తన చాంబర్‌లో అభినందించారు. హనుమకొండలో 34వ సౌత్ జోన్ మీట్ రాష్ట్రస్థాయి పోటీల్లో భద్రాచలానికి చెందిన బట్ట పృథ్విక, జావలిన్‌త్రోలో ఎస్.కె అమ్రిన్, కిన్నెరసాని మోడల్ స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబర్చగా వారిని అభినందించారు. వారికి రెండు జతల ట్రాకింగ్ షూస్ అందించారు. అదేవిధంగా చిత్ర కళలో రాణిస్తున్న ఇర్పా స్వాతి పెయింటింగ్‌లను పరిశీలించారు.
ఐటీడీఏ పీఓ రాహుల్