
ఏసీబీకి చిక్కిన ఏడీఏ
సూపర్‌బజార్(కొత్తగూడెం): ఎరువుల దుకాణం యజమాని నుంచి రూ. 25వేలు లంచం తీసుకుంటూ కొత్తగూడెం వ్యవసాయ శాఖ ఏడీఏ నరసింహారావు సోమవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. లక్ష్మీదేవిపల్లి మండలం బంగారుచెలక గ్రామంలో ఎరువుల షాపు యజమాని నిబంధనలకు విరుద్ధంగా యూరియా విక్రయిస్తున్నాడంటూ ఏడీఏ నరసింహారావు షోకాజ్ నోటీసు ఇచ్చారు. తాను నిబంధనల ప్రకారమే అమ్ముతున్నానని, షోకాజ్ నోటీసును ఉపసంసరించుకోవాలని దుకాణం యజమాని ఏడీఏను కోరగా రూ.50వేలు లంచంగా డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఆ శాఖ అధికారుల సూచన మేరకు షాపు యజమాని ఏడీఏ వద్దకు వెళ్లి రూ.50 వేలు ఇవ్వలేనని, కొంత తగ్గించమని కోరగా.. చివరకు రూ.25వేలకు బేరం కుదిరింది. ఈ క్రమంలో సోమవారం చుంచుపల్లి మండలం విద్యానగర్‌లోని తన కార్యాలయంలో ఏడీఏ రూ. 25 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ ఆధ్వర్యంలో సిబ్బంది రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం డీఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమ దృష్టికి తీసుకు రావాలని సూచించారు.
రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు