
● పాల్వంచ పోలీస్‌స్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు ● ని
ఐసీడీఎస్ సంరక్షణలో బాలిక
కొత్తగూడెంటౌన్: ఏపీలోని చింతూరు మండలానికి చెందిన బాలిక(17).. రాత్రి 11 గంటల సమయంలో పాల్వంచ మండలంలోని పెద్దమ్మతల్లి ఆలయం సమీపంలోని డివైడర్‌పై బిక్కుబిక్కుమంటూ కూర్చోగా.. సీసీ కెమెరాల ద్వారా గుర్తించిన ఆలయ వాచ్‌మెన్ బాలికకు ఆశ్రయం కల్పించాడు. శనివారం ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించగా.. వారు బాలికను కొత్తగూడెంలోని శక్తి సదన్‌కు తరలించి సంరక్షించారు. ఈ మేరకు సీడీపీఓ లక్ష్మీప్రసన్న ఆదివారం పాల్వంచ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. అనంతరం బాలికను పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేశారు. చింతూరు మండలానికి చెందిన బాలిక ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలోని బంధువుల ఇంటికి వెళ్లింది. తిరిగి ఇంటికి వెళ్లేందుకు శుక్రవారం సాయంత్రం కుంటలో బస్సు లేకపోవడంతో ట్రాలీ ఆటో ఎక్కింది. అయితే ట్రాలీలో ఉన్న యువకులు మధ్యలో తనకు కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి తాగించారని, ఆ తర్వాత మెలకువ వచ్చేసరికి పెద్దమ్మగుడి వద్ద ఉన్నానని చెప్పినట్లు ఐసీడీఎస్ అధికారులు వెల్లడించారు. బాధితురాలి వివరాలు తెలుసుకుని తల్లిదండ్రులకు సమాచారం అందించామని సీడీపీఓ లక్ష్మీప్రసన్న, బాలల సంక్షేమాధికారి హరికుమారి తెలిపారు. అయితే బాలికపై అత్యాచారం జరిగిందా లేదా అనేది వైద్యుల రిపోర్టు వస్తే కానీ వెల్లడి కాదని చెప్పారు. కాగా, బాధితురాలిపై అమానవీయంగా వ్యవహరించిన ఘటనను ఎస్పీ రోహిత్‌రాజు తీవ్రంగా పరిగణించారు. నిందితులను పట్టుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.