నెలలుగా ఎదురుచూపు.. | - | Sakshi
Sakshi News home page

నెలలుగా ఎదురుచూపు..

Aug 14 2025 7:10 AM | Updated on Aug 14 2025 7:10 AM

నెలలు

నెలలుగా ఎదురుచూపు..

ఇల్లెందు: రేషన్‌ డీలర్లు ఐదు నెలలుగా కమీషన్‌ అందక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం నిర్ణయించినట్లు జూన్‌, జూలై, ఆగస్టు మూడు నెలల స్టాక్‌ కూడా సకాలంలో పంపిణీ చేశారు. ఈ మూడు నెలల కమిషన్‌తో పాటు ఏప్రిల్‌, మే నెలల కమీషన్‌ కూడా పెండింగ్‌లో ఉంది. ఇలా ఐదు నెలల కమీషన్‌ ప్రభుత్వం నుంచి విడుదల కాకపోవటం వల్ల రేషన్‌ డీలర్లు పరేషాన్‌ అవుతున్నారు. జిల్లాలో 443 దుకాణాలు ఉండగా 305 మంది రేషన్‌ డీలర్లు ఉన్నారు. ప్రతీ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్‌ షాపులు తెరిచి ఉంచి లబ్ధిదారులకు రేషన్‌ అందించాల్సి ఉంది. ప్రభుత్వం క్వింటాకు రూ.140 కమీషన్‌ ఇవ్వాలి. అందులో నుంచి రేషన్‌ డీలర్‌ బియ్యం బస్తాల దిగుమతి కింద హమాలీలకు క్వింటాకు రూ.17 చెల్లించాల్సి ఉంది. 15 రోజుల పాటు రేషన్‌ షాపులో పనిచేసిన వర్కర్‌కు రోజుకు రూ.400 చెల్లించాల్సి ఉంది. రేషన్‌ షాపు కిరాయి కింద నెలకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు చెల్లించాల్సి ఉంది. ఐదు నెలలుగా కమీషన్‌ జాప్యం కారణంగా ఇల్లు గడువటం కష్టంగా మారిందని, రేషన్‌ షాపు కిరాయితో పాటు వర్కర్‌, హమాలీలకు జేబు నుంచి చెల్లించి ఎదురు చూడాల్సి వస్తోందని మదనపడుతున్నారు. డీలర్ల పరిధిలో 2,97,189 రేషన్‌ కార్డులు ఉన్నాయి. గత జూన్‌ నెలాఖరు నాటికి 3 నెలల కోటా 17,287 మెట్రిక్‌ టన్నుల బియ్యం ఒకే నెలలో లబ్ధిదారులకు అందజేశారు.

కష్టాలు ఎన్నో..

రేషన్‌ దుకాణాలకు ఇళ్లు కిరాయికి ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావటం లేదు. రేషన్‌ స్టాక్‌ భద్రపరిచితే పురుగులు వస్తాయని, పందికొక్కులు, ఎలుకల బెడద ఉంటుందని భయపడుతున్నారు. దీంతో పురాతన ఇళ్లల్లోనే ఈ రేషన్‌ షాపులు నడుస్తున్నాయి. పట్టణంలోని 13వ నంబర్‌బస్తీ 16వ వార్డులో అద్దె ఇల్లయిన రెండు గదుల రేకుల షెడ్డులో రేషన్‌ దుకాణం (3020040) నడుస్తోంది. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని మూడు నెలల రేషన్‌ ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయం మేరకు డీలర్లు మూడు నెలల స్టాక్‌ను ఐదు దఫాలుగా తెచ్చి అందించారు. స్టాక్‌ ఉన్న కాలంలో 15 రోజులపాటు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు షాపు తెరిచి ఉంచాల్సిందే. రేషన్‌ తీసుకునే సమయంలో మూడు దఫాలు వేలిముద్రలు వేయాలి.

ఐదు నెలలుగా అందని కమీషన్‌..

ఐదు నెలలుగా కమీషన్‌ అందలేదు. ప్రతీ నెలా అందాల్సిన కమీషన్‌ ఐదు నెలలైనా రాకపోవడంతో కుటుంబాలు ఎలా గడుస్తాయి. క్వింటా రేషన్‌కు రూ.140 రావాల్సి ఉంది. ప్రభుత్వం ప్రతీ నెలా కమీషన్‌ అందజేయాలి. మా ఇబ్బందులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

–కె.దయాకర్‌, డీలర్‌, 2వ నంబర్‌బస్తీ

ప్రతీ నెలా అందజేయాలి..

జిల్లాలో 305 మంది రేషన్‌ డీలర్లు ఉన్నారు. వీరందరికి 5 నెలలుగా కమీషన్‌ అందలేదు. దీంతో రేషన్‌ షాపులు నడపటం కష్టంగా మారుతోంది. తక్షణం ప్రభుత్వం, పౌరసరఫరాలశాఖ అధికారులు స్పందించి కమీషన్‌ అందేలా చర్యలు తీసుకోవాలి. కమీషన్‌ను ప్రతీ నెలా ఇచ్చేలా చూడాలి. –ఊకే శేఖర్‌రావు,

రేషన్‌ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు

నెలలుగా ఎదురుచూపు.. 1
1/2

నెలలుగా ఎదురుచూపు..

నెలలుగా ఎదురుచూపు.. 2
2/2

నెలలుగా ఎదురుచూపు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement