
పెళ్లింట పెను విషాదం
● రోడ్డు ప్రమాదంలో వధువు అన్న, బంధువు దుర్మరణం ● వరుడికి కొత్త బట్టలు ఇచ్చేందుకు వెళ్తుండగా ఘటన
తిరుమలాయపాలెం/ముదిగొండ: మూడేళ్ల క్రితం తండ్రి కన్నుమూశాడు. దీంతో కుటుంబ బాధ్యత తీసుకున్న యువకుడు అన్నీ తానై చెల్లెలి పెళ్లి ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాడు. 24గంటలు గడిస్తే చెల్లెలిని పెళ్లి మండపంలో చూడాల్సిన ఆ యువకుడిని రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. ఆయనతో మరో బంధువు సైతం మృతి చెందడంతో అంత సేపు పెళ్లి సందడి నెలకొన్న ఇంట్లో విషాదం అలుముకుంది. ముదిగొండ మండలం గోకినపల్లి సమీపాన బుధవారం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
వధువుకు మంగళస్నానం చేయించి...
తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలుకు చెందిన దొండేటి నాగేశ్వరరావు – పద్మ దంపతులకు కుమారుడు సాయిరంజిత్(34) కుమార్తె సాయి మనీషా ఉన్నారు. నాగేశ్వరరావు గుండె సంబంధిత వ్యాధితో మూడేళ్ల క్రితం మృతిచెందాడు. సివిల్ ఇంజనీరింగ్ చేసిన రంజిత్ కేరళలో ఉద్యోగం చేస్తూ కుటుంబ బాధ్యతలు చూసుకుంటున్నాడు. ఆయన చెల్లి సాయిమనీషా వివాహం నల్లగొండ జిల్లా దామరచర్ల వాసితో నిశ్చయం కాగా గురువారం వివాహం జరగాల్సి ఉంది. ఈమేరకు పిండిప్రోలులో చెల్లి సాయిమనీషా మంగళస్నానాల కార్యక్రమంలో కుటుంబంతో సంతోషంగా గడిపిన రంజిత్ వరుడికి పెళ్లి బట్టలు, ఇతర సామగ్రి ఇచ్చేందుకు సమీప బంధువు, తిరుమలాయపాలెంకు చెందిన కొండబాల శ్రీనివాసరావు(65)తో కలిసి కారులో దామరచర్ల బయలుదేరాడు. అయితే, భారీ వర్షం వస్తుండడంతో ముదిగొండ మండలం గోకినపల్లి వద్ద కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జుకాగా రంజిత్, శ్రీనివాసరావు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. ఈ విషయం తెలియగానే పెళ్లి పనులతో హడావుడిగా ఉన్న ఆయన కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. తిరుమలాయపాలెంకు చెందిన శ్రీనివాసరావుకి భార్య రమాదేవి, కుమారుడు రమేష్‌బాబు, కుమార్తె శరణ్య ఉన్నారు. కొంతకాలంగా కుమార్తె శరణ్య ఇంట్లోనే ఉంటుండగా ఆయన మృతితో కుటుంబం పెద్దదిక్కును కోల్పోయింది. ఘటనపై ముదిగొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పెళ్లింట పెను విషాదం