చూద్దాం రండి..!
మ్యూజియం..
● ప్రజల ఆదరణ చూరగొంటున్న భద్రాచలంలోని గిరిజన మ్యూజియం ● ఏజెన్సీ కేంద్రంలో సరికొత్త ఆటవిడుపు ● రూ.కోటి నిధులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ● ఐటీడీఏ పీఓ రాహుల్‌కు ప్రశంసల వెల్లువ
భద్రాచలం: గిరిజన సంస్కృతీ, సంప్రదాయాలను పరిరక్షించేందుకు ఐటీడీఏ పీఓ రాహుల్ తీసుకున్న నిర్ణయం, చేసిన కృషి సత్ఫలితాలను ఇచ్చింది. ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గిరిజన మ్యూజియానికి ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. ప్రజాప్రతినిధుల ప్రశంసలు దక్కడంతో పాటు కేంద్ర ప్రభుత్వం రూ.కోటి నిధులను విడుదల చేస్తామని వెల్లడించింది. ఇలాంటి గిరిజన మ్యూజియాలను అన్ని ఐటీడీఏల్లో ఏర్పాటు చేస్తామని మంత్రి సీతక్క ప్రకటించడంతో పీఓ రాహుల్ కృషికి ఫలితం దక్కినట్లయింది.
ఫొటోలకు అనుమతి
గిరిజన మ్యూజియంలో గతంలో కేవలం వస్తువులు, పరికరాల సందర్శనకు మాత్రమే అనుమతించే వారు. ప్రస్తుతం పర్యాటకులు, వీక్షకులు ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు కూడా అనుమతివ్వడంతో బారులుదీరుతున్నారు. విశాలంగా గిరిజన పల్లె తరహాలో ఏర్పాటు చేసిన ప్రదేశాల్లో సెల్ఫీలు తీసుకునేందుకు, పుట్టినరోజు ఇతర పార్టీలను చేసుకునేందుకు అనువుగా ఉండటంతో ప్రజలు తరలివస్తున్నారు. వెదురుతో చేసిన సెల్ఫీ పాయింట్, రంగురంగుల విద్యుత్ అలంకరణ జత కూడాయి. గిరిజన వంటకాలు ఆహుతులను అలరిస్తున్నాయి.
ఏజెన్సీ కేంద్రంలో ఆటవిడుపు..
పిల్లలకు, యువతకు, పెద్దలకు ఆటవిడుపునకు కేంద్రంగా తీర్చిదిద్దటం అద్భుత ఫలితాలను ఇచ్చింది. పిల్లలకు పెడల్ బోటింగ్, పార్క్, యువతకు బాక్స్ క్రికెట్, పెద్దలకు ఇసుక వాలీబాల్, షటిల్ తదితర ఆటల సెంటర్లను ఏర్పాటు చేయడంతో పెద్ద ఆటవిడుపుగా మారింది. వారాంతం, సెలవు రోజుల్లో జాతరను తలపించేలా జనం వస్తున్నారు. ఏప్రిల్ 7న దీనిని గవర్నర్ మహదేవ్‌వర్మ ప్రారంభించగా, నాటి నుంచి ఇప్పటి వరకు 50 వేలకు పైగానే దీనిని సందర్శించారు.
విశ్వవ్యాప్తం చేయాలి
గిరిజన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను విశ్వవ్యాప్తం చేయాలని రూపొందించిన గిరిజన మ్యూ జియానికి ఇంత ఆదరణ లభించటం సంతోషంగా ఉంది. హైదరాబాద్‌లోని తాజ్ బంజారాలో జరిగిన కాన్ఫరెన్స్‌లో దీనిపై వివరించటం, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్, న్యూఢిల్లీ రూ.కోటి నిధుల ప్రకటన, మంత్రి సీతక్క, ట్రైబల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శరత్‌ల సత్కారం.. గిరిజనులకు, అధికారులకు జరిగిన సన్మానంగా భావిస్తున్నా.
– బి.రాహుల్, పీఓ, ఐటీడీఏ భద్రాచలం
కేంద్రం నుంచి రూ.కోటి నిధులు
మ్యూజియం ప్రారంభమైన నాటి నుంచి సందర్శించిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు పీఓ కృషిని ప్రశంసించారు. తాజాగా సందర్శించిన మంత్రి సీతక్క అన్నింటిని వీక్షించి పర్యాటకుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం ప్రజాప్రతినిధుల సిఫార్సుతో భద్రాచలం గిరిజన మ్యూజియం అభివృద్ధికి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ (మోట) న్యూఢిల్లీ నుంచి రూ.కోటి నజరాన ప్రకటన వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నిధులను విడుదల చేస్తే ఐటీడీఏ మ్యూజియానికి ప్రత్యేక గుర్తింపు వచ్చే విధంగా తీర్చిదిద్దవచ్చు. అరకు, అసోం ప్రాంతాల్లో మాదిరిగా భద్రాచలం ప్రత్యేకమైన గిరిజన కొమ్ము, కోయ నృత్యాలలో పర్యాటకులను భాగస్వాములను చేసే విధంగా ప్రణాళికలను రూపొందిస్తున్నారు.
చూద్దాం రండి..!
చూద్దాం రండి..!


