ఆస్తుల కన్నా.. పర్యావరణం మిన్న
● వన మహోత్సవంలో సింగరేణి సీఎండీ ● 121 మొక్కలు నాటిన బలరామ్
సింగరేణి(కొత్తగూడెం): ప్రపంచంలో అన్నింటికీ హద్దులు ఉన్నా.. గాలి, వెలుతురు, ఆక్సిజన్‌కు లేవని, ఎవరైనా కుటుంబసభ్యులకు ఇళ్లు, స్థలాలు, బంగారు ఆభరణాలు ఇస్తుంటారని, వాటన్నింటి కంటే పర్యావరణం ముఖ్యమని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ అన్నారు. కొత్తగూడెం ఏరియా పరిధిలోని జీకేఓసీ డంప్‌యార్డ్ వద్ద ఆదివారం వన మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన 121 మొక్కలు నాటారు. దీంతో తాను ఇప్పటివరకు 19,121 మొక్కలు నాటానని, వచ్చే జూలై చివరి నాటికి మరో 1,879 మొక్కలు నాటి.. 21వేల లక్ష్యాన్ని చేరాల్సి ఉందని వివరించారు. ఒక మొక్క ద్వారా రూ. కోటి విలువైన ఆక్సిజన్ ఉచితంగా పొందవచ్చన్నారు. భావితరాలకు అదే మనమిచ్చే ఆస్తి అని చెప్పారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది సింగరేణి ఆధ్వర్యంలో 40 లక్షల మొక్కలు నాటనున్నట్లు వెల్లడించారు. అనంతరం చెరువు పక్కన కాసేపు ధ్యానం చేశారు. కార్యక్రమంలో ఏరియా జీఎం శాలేంరాజు, డైరెక్టర్లు ఎల్.వి.సూర్యనారాయణ, కె.వెంకటేశ్వర్లు, అటవీ, పర్యావరణ శాఖ సలహాదారు మోహన్ చంద్ర పరిగెన్, పర్యావరణ జీఎం సైదులు, జీకేఓసీ పీఓ రమేష్, సూర్యనారాయణ, ఎండీ రజాక్, గట్టయ్య తదితరులు పాల్గొన్నారు.


