ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో తప్పులు సరిదిద్దుకోండి
చండ్రుగొండ: ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో లబ్ధిదారుల పేర్లల్లో తప్పులు ఉంటే సరిదిద్దుకోవాలని జిల్లా హౌజింగ్ పీడీ శంకర్ సూచించారు. మండలంలోని బెండాలపాడు గ్రామంలో మంగళవారం ఆయన ఇంటింటికీ తిరిగి లబ్ధిదారుల జాబితాను పరిశీలించి మాట్లాడారు. తప్పులున్న వారి జాబితాను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని, ఆయన ఆదేశాల మేరకు వాటిని సరిదిద్దుతామని వెల్లడించారు. ఆయన వెంట దిశ కమిటీ సభ్యుడు బొర్రా సురేశ్, పంచాయతీ కార్యదర్శి రోహిత్, ఏఈలు రాము, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
సరళమైన పద్ధతిలో బోధించాలి
పాల్వంచ: ఉపాధ్యాయులు ప్రతి సబ్జెక్ట్‌లో మెళకువలు నేర్చుకుని, సరళమైన పద్ధతిలో విద్యార్థులకు బోధించాలని డీఈఓ ఎం.వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం స్థానిక కొమ్ముగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి భౌతిక, రసాయనశాస్త్ర ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని, సబ్జెక్ట్‌లను పూర్తిగా అవగాహన చేసుకుని, విద్యార్థులు అవపోసన పట్టే విధంగా కృషి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కోర్స్ కోఆర్డినేటర్ ఎస్.సైదులు, డీఆర్‌పీలు సంపత్, ప్రభుసింగ్, అపక శంకర్, మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
అత్యవసర సర్వీసులపై అవగాహన
తిరుమలాయపాలెం: తిరుమలాయపాలెం సీహెచ్‌సీకి ఇటీవల 108, 102 నియోనేటల్ అంబులెన్స్ సేవలు మంజూరయ్యాయి. ఆయా వాహనాల్లో ఉన్న అత్యాధునిక పరికరాల వినియోగంపై అత్యవసర సేవల ఉమ్మడి జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ శివకుమార్ ఉద్యోగులకు అవగాహన కల్పించారు. సీహెచ్‌సీకి మంగళవారం వచ్చిన ఆయన అంబులెన్స్‌ల్లోని సౌకర్యాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కృపా ఉషశ్రీ ఉద్యోగులు దుర్గాప్రసాద్, శ్రీనివాస్, సీతారాం తదితరులు పాల్గొన్నారు.
విశ్రాంత ఉద్యోగి
మృతదేహం లభ్యం
సుజాతనగర్: మండలంలోని డేగలమడుగు సమీప పంట పొలాల్లో ఓ మృతదేహం ఉందనే సమాచారంతో పోలీసులు మంగళవారం విచారణ చేపట్టారు. ఈమేరకు పాల్వంచ టీచర్స్ కాలనీకి చెందిన పోస్టల్ విశ్రాంత ఉద్యోగి షేక్ ఖాసిం(61)గా గుర్తించారు. కాగా, డేగలమడుగు వాసులకు సోమవారం కనిపించిన ఆయన మంగళవారం మధ్యాహ్నానికి మృతదేహంగా మారాడు. ఖాసిం మరణంపై ఎలాంటి అనుమానం లేదని, అనారోగ్యంతో మృతి చెందాడని ఆయన కుమార్తె షేక్ మౌలాబీ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఎం.రమాదేవి తెలిపారు.
దాడులకు పాల్పడడం హేయమైన చర్య
ఖమ్మంమామిళ్లగూడెం: ఆపరేషన్ సిందూర్ విజయవంతం సందర్భంగా సైనికుల త్యాగా లు, కేంద్ర ప్రభుత్వ ఘనతను కీర్తిస్తూ ఖమ్మంలో తిరంగా ర్యాలీ నిర్వహిస్తుంటే విచ్ఛిన్నం చేసేలా కొందరు దాడులకు పాల్పడటం గర్హనీయమని బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు పేర్కొన్నారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ దేశ ప్రతిష్టను పెంచిన జవాన్ల వీరోచిత పోరాటాన్ని కొనియాడుతూ చేపట్టిన ర్యాలీకి మద్దతు తెలపాల్సింది పోయి మత విద్వేషాలను రెచ్చగొట్టడం బాధాకరమని తెలి పారు. ఈమేరకు జాతీయవాదులపై దాడి చేసిన వారిపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని ఆయన కోరారు. ఈసమావేశంలో నాయకులు నున్నా రవికుమార్, ఈ.వీ.రమేష్, సన్నే ఉదయ్‌ప్రతాప్, అల్లిక అంజయ్య, నంబూరి రామలింగేశ్వరరావు, రవిరాథోడ్, బెనర్జీ, నల్లగట్టు ప్రవీణ్‌కుమార్, ధనియాకుల వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో తప్పులు సరిదిద్దుకోండి
ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో తప్పులు సరిదిద్దుకోండి
ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో తప్పులు సరిదిద్దుకోండి


