95 శాతం ఉత్పత్తి
● నెలవారీ లక్ష్యానికి చేరువగా సింగరేణి ● రెండు ఏరియాల్లో నూరుశాతానికి మించి బొగ్గు వెలికితీత
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థ గత ఏప్రిల్‌లో 95 శాతం మేర బొగ్గు ఉత్పత్తి సాధించింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో సంస్థ 76 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. గత నెలలో సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ఏరియాల్లోని 19 ఓపెన్ కాస్ట్ గనులకు, 21 భూగర్భ గనుల్లో 52.78 లక్షల టన్నుల లక్ష్యం నిర్దేశించగా 49.19 లక్షల టన్నుల బొగ్గు వెలికితీశారు. 95 శాతం ఉత్పత్తి సాధించారు. భూగర్భ గనుల్లో 67 శాతం, ఓపెన్ కాస్ట్ గనుల్లో 97 శాతం ఉత్పత్తి నమోదైంది. రానున్న వర్షాకాలంలో ఉత్పత్తి తగ్గే అవకాశం ఉండగా, ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో అధికంగా బొగ్గు వెలికి తీయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే గత నెల 1 నుంచి అధికారులు గనుల వారీగా పర్యవేక్షణ చేపడుతూ, సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఉత్పత్తి పెంచాలని సూచించారు. కాగా సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో ఏప్రిల్‌లో ఆర్జీ–2 ఏరియా 219 ఉత్పత్తి శాతంతో మొదటి స్థానంలో, మణుగూరు ఏరియా 117 శాతంతో రెండో స్థానంలో నిలిచాయి.
అధికారులు మరింత శ్రద్ధ పెట్టాలి
గనుల్లో ఎల్‌హెచ్‌డీలు తరచూ మొరాయిస్తున్నాయి. డంపర్లు, డోజర్ల మెయింటెనెన్స్ కూడా తగ్గింది. సంస్థ ఉన్నతాధికారులు మరింత శ్రద్ధ పెడితే 100 శాతం బొగ్గు ఉత్పత్తి చేసే అవకాశం ఉంది.
–రియాజ్ అహ్మద్, హెచ్‌ఎంఎస్ జనరల్ సెక్రటరీ
లక్ష్యాలు సాధించాలి
సంస్థ నిర్దేశించిన రోజు, నెలవారీ బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు కచ్చితంగా సాధించాలి. గనుల్లో యాంత్రిక సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తాం. యంత్రాల పని గంటలు పెంచాలి.
–ఎల్వీ సూర్యనారాయణ, డైరెక్టర్ (ఆపరేషన్స్)
ఏప్రిల్‌లో సాధించిన ఉత్పత్తి (లక్షల టన్నుల్లో)
ఏరియా నిర్దేశిత ఉత్పత్తి ఉత్పత్తి
లక్ష్యం శాతం
కొత్తగూడెం 13.06 12.08 93
ఇల్లెందు 3.10 2.55 82
మణుగూరు 9.26 10.88 117
మందమర్రి 2.21 1.55 70
శ్రీరాంపూర్ 5.53 5.11 92
ఆర్జీ–1 4.06 2.06 51
ఆర్జీ–2 2.28 4.99 219
ఆర్జీ–3 5.75 5.09 89
బెల్లంపల్లి 3.50 2.73 78
భూపాలపల్లి 3.85 2.69 70
అడ్రియాల 0.15 0.12 84


