మామిడి మొక్కల పెకిలింపు | - | Sakshi
Sakshi News home page

మామిడి మొక్కల పెకిలింపు

Apr 18 2025 12:15 AM | Updated on Apr 18 2025 12:15 AM

మామిడి మొక్కల పెకిలింపు

మామిడి మొక్కల పెకిలింపు

దమ్మపేట: వ్యవసాయ క్షేత్రంలోకి అక్రమంగా ప్రవేశించి, మామిడి మొక్కలను పెకిలించడంతోపాటు చంపుతామని బెదిరించిన వ్యక్తులపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... మండలంలోని మందలపల్లి గ్రామానికి చెందిన యర్రపాటి పకీర్‌రావు అఖినేపల్లిలోని తన వ్యవసాయ భూమి మామిడి మొక్కలు సాగు చేస్తున్నాడు. బుధవారం మందలపల్లి గ్రామానికి చెందిన వేమవరపు రామకృష్ణ, దండాబత్తుల కాంతారావులు పకీర్‌రావుకు చెందిన వ్యవసాయ క్షేత్రంలోకి అక్రమంగా ప్రవేశించి, సాగులో ఉన్న మామిడి మొక్కలను పెకిలించారు. ప్రశ్నించిన పకీర్‌రావు కుమారుడు ఏకాంబరేశ్వరరావు, అతడి మిత్రుడు కోలికపోగు కాంతారావులను చంపుతామని కత్తితో బెదిరింపులకు పాల్పడ్డారు. పెకిలించిన మొక్కల విలువ రూ.10,000 ఉంటుందని బాధితులు తెలిపారు. బాధిత రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై సాయికిషోర్‌ రెడ్డి తెలిపారు.

‘రాజీవ్‌ యువ వికాసం’పై ఆరా

చండ్రుగొండ : రాజీవ్‌ యువ వికాసం పథకం దరఖాస్తులపై జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి ఆరా తీశారు. ఎంపీడీఓ కార్యాలయాన్ని గురువారం ఆమె సందర్శించారు. రుణాల మంజూరు కోసం వచ్చిన దరఖాస్తుల జాబితా పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వివరాలను ఎంపీడీఓ బయ్యారపు అశోక్‌ను అడిగి తెలుసుకున్నారు. మండలంలోని 14 పంచాయతీల్లో 3200 మంది లబ్ధిదారులు ఉన్నారని, తొలి, మలి విడతల్లో బెండాలపాడు గ్రామానికి మంజూరైన 303 ఇళ్ళ నిర్మాణాలు జరుగుతున్నాయని ఎంపీడీఓ వివరించారు.

బాల్య వివాహం..

కేసు నమోదు

పాల్వంచరూరల్‌: మైనర్‌ బాలికను వివాహం చేసుకున్న వ్యక్తిపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని మొండికట్ట గ్రామానికి చెందిన 21 ఏళ్ల గండికోట రవీందర్‌ అదే గ్రామానికి చెందిన 7వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలికను ఈ నెల 11న వివాహం చేసుకున్నాడు. ఈ ఘటనపై చైల్డ్‌లైన్‌, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ మాధవీలత ఫిర్యాదు మేరకు రవీందర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేష్‌ తెలిపారు.

సెల్‌ఫోన్‌లో గేమ్‌ ఆడి...

రూ.68 వేలు పోగొట్టుకున్న యువకుడు

పాల్వంచరూరల్‌: సెల్‌ ఫోన్‌లో గేమ్‌ ఆడి రూ. 68 వేలు పోగొట్టుకున్నాడో యువకుడు. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని కేశవాపురం గ్రామానికి చెందిన మాళోత్‌ రాణి కుమారుడు వంశీ ఈ నెల 14న సెల్‌ఫోన్‌లో గేమ్‌ ఆడుకుంటున్నాడు. అదే సమయంలో రూ.పదివేలు పెట్టి ఆడితే రెట్టింపు డబ్బులు గెలవవచ్చని అపరిచిత వ్యక్తి నుంచి లింక్‌ వచ్చింది. దీంతో యువకుడు లింక్‌ ఓపెన్‌చేసి గేమ్‌ ఆడగా, రూ.68 వేలను సైబర్‌ నేరగాళ్లు కాజేశారు. గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, సైబర్‌ క్రైమ్‌ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేష్‌ తెలిపారు.

మైక్రో ఫైనాన్స్‌

వేధింపులపై ఫిర్యాదు

చుంచుపల్లి: మండల పరిధిలో మైక్రో ఫైనాన్స్‌ యజమానులు పలువురు మహిళలను రుణాల విషయంలో వేధిస్తున్నారని గురువారం చుంచుపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ రవి కుమార్‌కు మౌఖికంగా ఫిర్యాదు చేశారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ తెలిపారు.

లారీ ఢీకొని మహిళకు గాయాలు

దమ్మపేట: బైక్‌ను లారీ ఢీకొట్టిన ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలైన ఘటన మండల పరిధిలోని వెంకటరాజాపురం సమీపంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... మండలంలోని ముష్టిబండ గ్రామానికి చెందిన నడ్డి రాజు, అల్లంశెట్టి కృష్ణారావు, తంగిరాల శ్రీలత(35)లు బుధవారం రాత్రి సమయంలో బైక్‌పై అశ్వారావుపేట నుంచి స్వగ్రామానికి వస్తున్నారు. ఈ క్రమంలో వెంకటరాజాపురం గ్రామ సమీపంలో వెనుక నుంచి వస్తున్న లారీ బైక్‌ను ఢీకొట్టింది. దీంతో శ్రీలతకు తీవ్రగాయాలయ్యాయి. ఖమ్మం తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రురాలి భర్త రమేష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయికిషోర్‌ రెడ్డి తెలిపారు.

పాఠశాలలో చోరీ

జూలూరుపాడు: మండల కేంద్రంలోని కోయకాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బుధవారం రాత్రి చోరీ జరిగింది. గురువారం ఉదయం పాఠశాలకు వచ్చేసరికి పాఠశాల తలుపులు, లోపల ఇనుప బీరువా పగులగొట్టి మైక్‌ స్పీకర్‌, క్రీడా సామగ్రి అపహరించారని హెచ్‌ఎం జర్పల కృష్ణ తెలిపారు. దీంతో ఎంఈఓ బానోత్‌ జుంకీలాల్‌, కాంప్లెక్స్‌ హెచ్‌ఎం లక్ష్మీనర్సయ్యలకు, పోలీసులకు సమాచారం ఇచ్చామని పేర్కొన్నారు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారని, అనంతరం తాను స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు హెచ్‌ఎం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement