● పోటాపోటీగా నగదు పంపిణీ?!
● ఏదులాపురంలో రూ.2 వేల నుంచి
రూ.5 వేల వరకు..
ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి 32 వార్డుల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎంత ఖర్చయినా పర్వాలేదు.. గెలుపు ముఖ్యం అన్నట్లుగా ఓటర్లకు నగదు పంపిణీ చేసినట్లు తెలిసింది. ఇందుకోసం కొందరు అప్పులు చేసి మరీ ఎదుటి అభ్యర్థికి దీటుగా డబ్బులు ఇచ్చినట్లు సమాచారం. ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం ముగియగా, మంగళవారం ఉదయం మొదలు అర్ధరాత్రి వరకు డబ్బులు పంపిణీ చేసినట్లు చెబుతున్నారు. గతంలో ఎన్నికల సమయాన ఎవరైనా అభ్యర్థి డబ్బు పంపిణీ చేస్తుంటే ప్రత్యర్థులు అధికారులకు సమాచారం ఇచ్చేవారు. కానీ, ఈ సారి అభ్యర్థులు, వారి అనుచరులు బహిరంగంగా పంపకాలు చేపట్టినా ఎవరూ ఫిర్యాదు చేసుకోకపోవడం గమనార్హం. దాదాపు అన్ని వార్డుల్లో ఓటుకు కనీసం రూ.2 వేలకు తగ్గకుండా రూ.5 వేల వరకు ఇచ్చినట్లు సమాచారం. ఓ అభ్యర్థి ఎంత ఇస్తున్నారో తెలుసుకుని అంతకు రూ.500 కలిపి ఎదుటి అభ్యర్థి ఇవ్వగా.. ఇంకొందరు నగదుకు తోడు చీర, చికెన్, మద్యం క్వార్టర్ సీసాలు కూడా పంపిణీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.


