ఆత్మహత్యాయత్నం కాదు.. నిప్పంటించారు..!
మణుగూరురూరల్: మండలంలోని అశోక్‌నగర్ ప్రాంతానికి చెందిన అడ్డగార్ల సురేశ్ అత్మహత్యాయత్నం కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఒంటిపై నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని భావించిన ఘటన.. తాజాగా కొత్తమలుపు తిరిగింది. గత శుక్రవారం గాయాలపాలైన సురేశ్‌ను తొలుత భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ తరలించారు. సురేశ్ భార్య తన భర్త ఆత్మహత్యాయత్నానికి నలుగురు కారణమంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. చికిత్స పొందుతున్న సురేశ్.. తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడలేదని, కొందరు వ్యక్తులు మాట్లాడాలని పిలిపించి తనపై పెట్రోల్ పోసి, నిప్పంటించారని మెజిస్ట్రేట్‌కు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనకు నిప్పంటించిన వారి పేర్లను సురేశ్ స్పష్టంగా పేర్కొనడంతో వ్యవహారం వేడెక్కింది. మెజిస్ట్రేట్‌కు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసు విచారణ చేపట్టినట్లు సమాచారం. ఈ విషయమై మణుగూరు పోలీసులను సంప్రదించగా.. ఘటనపై ఇప్పటికే కేసు నమోదైందని, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
వాంగ్మూలంలో వెల్లడించిన సురేశ్


