ఆర్టీసీ బస్సు – లారీ ఢీ
● చిన్నారి సహా పది మందికి గాయాలు ● వైరా రింగ్ సెంటర్‌లో ప్రమాదం
వైరా: నిండా ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు – లారీ ఢీకొన్న ఘటనలో పది మందికి గాయాలయ్యాయి. ఇందులో ఓ చిన్నారి కూడా ఉన్నాడు. వైరాలోని రింగ్ రోడ్డు సెంటర్‌లో మంగళవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో ఖమ్మం నుంచి మణుగూరుకు వెళ్తోంది. వైరా బస్టాండ్‌లో నుండి రింగ్ రోడ్డులోకి తిరుగుతున్న సమయాన తల్లాడ వైపు నుండి ఖమ్మం వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో గుండాల మండలం వేపలగడ్డ గ్రామానికి చెందిన వరమ్మ, భారతికి తీవ్రగాయాలయ్యాయి. అలాగే, భారతి మూడేళ్ల బిడ్డ దేవిక్ రెండు చేతి వేళ్లు విరగడమే కాక తలకు తీవ్ర గాయాలయ్యాయి. దేవికకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో తల్లి భారతి, నాయనమ్మ వరమ్మ ఖమ్మం తీసుకెళ్లి ఆస్పత్రిలో చూపించారు. ఆతర్వాత గుండాల వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో కొత్తగూడెం వెళ్లాలని మణుగూరు డిపో బస్సు ఎక్కగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో వీరు ముగ్గురికి తీవ్రగాయాలు కావడంతో వైరాలో చికిత్స అనంతరం మళ్లీ ఖమ్మం తరలించారు. ఇక కొత్తగూడేనికి చెందిన రియాజ్, రుద్రంపూర్‌కు చెందిన ప్రేమ్, పాల్వంచకు చెందిన శ్రావ్యకు, తల్లాడకు చెందిన జనార్దన్, భవాని, మోక్షిత్‌కు స్వల్ప గాయాలు కావడంతో స్థానికులు బయటకు తీసి చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం
మణుగూరు డిపో ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ఖమ్మం నుంచే వేగంగా, నిర్లక్ష్యంగా బస్సు నడిపాడని, దీంతో వైరాలో ప్రమాదం జరిగిందని అటు ప్రయాణికులు, ఇటు స్థానికులు వెల్లడించారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


