రఘునాథపాలెం: దాహార్తితో అల్లాడుతున్న మూగజీవాలు మందు కలిపిన నీళ్లు తాగగా మృత్యువాత పడ్డాయి. బాధితులు, గ్రామస్తులు కథనం ప్రకారం.. మండలంలోని కోయచలకకు చెందిన బొరిగర్ల లింగయ్య, బాబుకు చెందిన గొర్రెల మందను రోజూలాగే మేతకు తీసుకెళ్లారు. ఒక రైతు మిర్చి తోటలో మందుల పిచికారీకి నీళ్లలో కలిసి సిద్ధం చేసి ఉంచగా... గొర్రెలు ఆ నీళ్లు తాగాయి. దీంతో గొర్రెలు వరుసగా కింద పడిపోతుండడంతో కాపరులు వెంటనే పశు వైద్యుడికి సమాచారం ఇస్తుండగానే 20 గొర్రెలు, రెండు పోతులు ప్రాణం విడిచాయి. మిగిలిన వాటికి వైద్యం అందిస్తుండగా ఎన్ని కోలుకుంటాయో తెలియడం లేదు. సుమారు రూ.3.25 లక్షల నష్టం జరిగిందని, ప్రభుత్వం ఆదుకోవాలని యజమానులు కోరారు.