రూ.500 నోట్ల హవా..! | Sakshi
Sakshi News home page

రూ.500 నోట్ల హవా..!

Published Sun, Dec 3 2023 12:08 AM

- - Sakshi

భద్రాద్రి: అసెంబ్లీ ఎన్నికల పూణ్యమా అని ప్రస్తుతం మార్కెట్లో రూ.500 నోటు హవా కొనసాగుతోంది. ఎవరి చేతిలో చూసినా ఈ నోటే సందడి చేస్తోంది. రెండు, మూడు రోజులుగా సాధారణ వ్యక్తులతో పాటు అన్ని వర్గాల ప్రజల వరకు రూ.500 నోట్లు జోరుగా చేతులు మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇటీవల జోరుగా నగదు పంపిణీకి తెర లేపినట్లు తెలిసింది. ఓటర్లకు పంచడానికి ఈ పెద్ద నోట్లనే పెద్ద సంఖ్యలో వాడినట్లు కూడా సమాచారం. ఓటుకు నోటు పంపిణీలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లకు రూ.500 నోట్లను అందజేసినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లను ప్రలోభ పెట్టి తమ వైపు తిప్పుకునేందుకు ఖర్చుకు వెనకాడకుండా పెద్ద మొత్తంలో నగదు పంపిణీ చేసినట్లు అన్ని చోట్లా ఆరోపణలు వినిపించాయి. 

ఈసారి ఎన్నికల్లో అన్ని చోట్లా రూ.500 నోట్ల కట్టలు పెద్దఎత్తున చేతులు మారినట్లు తెలిసింది. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఓటుకు రూ.1,000 నుంచి 2,000 చొప్పున పంపిణీ చేసినట్లు పలువురు చెబుతున్నారు. అక్కడక్కడా పోటీ తీవ్రతను బట్టి ఓటర్లకు కొంత అదనంగా కూడా ముట్టజెప్పినట్లు కూడా వినిపించింది. అన్ని నియోజకవర్గాల్లో ఈ తంతు గత నెల 27 నుంచి 30 వరకు రాత్రింబవళ్లు కొనసాగగా.. ఈ పంపిణీలో ప్రధాన పార్టీల అభ్యర్థులు రూ.500 నోట్లనే పెద్ద మొత్తంలో సద్వినియోగం చేసుకున్నట్లు సమాచారం. ప్రతి గ్రామ పరిధిలో 70 శాతం చొప్పున ఈ పెద్దనోటు చేరింది. ఒకే ఇంట్లో నాలుగైదు ఓట్లు ఉంటే ఇక వారి పంట పండింది. 

కనీసం నాలుగు ఓట్లు ఉన్నవారికి దాదాపు 10 వేలకు పైగా చేతికందినట్లు తెలిసింది. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బును పంచారనే ఆరోపణలు సర్వత్రా వినిపించాయి. జిల్లాలో 5 నియోజకవర్గాల పరిధిలో దాదాపు రూ.300 కోట్ల వరకు ఓటర్లకు పంపిణీ జరిగినట్లు అంచనా. అధికార పార్టీ అభ్యర్థులు ఓటుకు రూ.1,500 నుంచి రూ.2,000 వేల చొప్పున నగదును పంపిణీ చేయగా, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు రూ.1,000 చొప్పున 70 శాతం ఓటర్లకు అందజేసినట్లు తెలుస్తోంది. ఒక్కొక్క అభ్యర్థికి నియోజకవర్గ పరిధిలో రూ.30 నుంచి రూ.40 కోట్ల వరకు పంచడానికి ఖర్చయినట్లు సమాచారం.

డిజిటల్‌ లావాదేవీలు తగ్గుముఖం..
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరి చేతికి నగదు చేరింది. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో దండిగా కరెన్సీ ఉంది. దీంతో ప్రజలు తమ అవసరాల కోసం మార్కెట్‌కు వెళ్లాలంటే రూ.500 నోట్లనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. కూరగాయలతో పాటు చిన్నాచితకా అవసరాలకు సైతం ఈ పెద్దనోటునే తీస్తున్నారు. అన్ని అవసరాలకు ఈ రూ.500 నోటే అధారంగా నిలుస్తోంది. రెండు రోజులుగా డిజిటల్‌ లావాదేవీలు సైతం తగ్గిపోయాయని బ్యాంకు అధికారులు, వ్యాపారులు చెబుతున్నారు. 

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమ అవసరాల నిమిత్తం చేతి నుంచే నగదు అందజేస్తున్నారని ఇందుకోసం ఎన్నికల వేళ ఇచ్చిన రూ.500 నోట్లనే ఎక్కువగా వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఇక మార్కెట్లో రూ.500 నోట్ల తాకిడితో రూ.100, రూ.200 నోట్ల చెలామణి అంతగా కనిపించడం లేదు. అంతటా పెద్దనోట్లు వాడటంతో అటు చిల్లర సమస్యలు తలెత్తుతున్నాయి. ఇటు ఫోన్‌–పే, గూగూల్‌–పే వినియోగం సగానికి తగ్గిపోగా, అటు ప్రధాన బ్యాంకులకు చెందిన ఏటీఎంలలో వినియోగదారుల సందడి కనిపించడం లేదు. 

అందరికీ చేతినిండా నగదు ఉండటంతో అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. దీంతో పలు ఏటీఎం సెంటర్లు సైతం కస్టమర్లు లేక వెలవెలబోయి కనిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ పెద్దనోట్ల చలామణి పెరిగిందని వ్యాపార వర్గాలు పేర్కొంటుండగా, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు సైతం కండక్టర్లకు రూ.500 నోటునే ఇవ్వటంతో చిల్లర లేక ఇబ్బందులు పడాల్సి వస్తోందని వాపోతున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పటివరకు అంతగా కనిపించని రూ.500 నోట్లు ప్రస్తుతం మార్కెట్‌లో సందడి చేస్తున్నాయి.

అందరూ పెద్ద నోట్లే ఇస్తున్నారు..
తాజాగా ఓటుకు నోటు పంపకాల్లో ప్రతి ఒక్కరికీ ఈ పెద్దనోట్లనే అందించినట్లున్నారు. దీంతో అందరి దగ్గర రూ.500 నోట్లే ఉంటున్నాయి. రెండురోజులుగా షాపునకు వచ్చే కస్టమర్లు చిన్న అవసరానికి కూడా ఈ నోటునే తీస్తున్నారు. మొన్నటివరకు చిన్న నగదుకు సైతం ఫోన్‌–పే, గూగుల్‌–పే వంటివి చేసేవారు. ఇప్పుడు అవి సగానికి సగం తగ్గిపోయాయి. అందరూ డబ్బులే ఇస్తున్నారు.
– బల్‌దేవ్‌, చిరు వ్యాపారి

Advertisement
Advertisement