రేపల్లె: సమస్యను పరిష్కరించాల్సిన మున్సిపల్ సిబ్బందే మరో వివాదానికి తెరలేపారు. ఓ ఇంటి యజమానిపై ఆగ్రహంతో ఏకంగా అతని ఇంటి ముందు చెత్త పోసి రాకపోకలకు ఇబ్బంది కలిగించిన ఘటన రేపల్లె పట్టణంలో కలకలం రేపింది. 13వవార్డు హౌసింగ్ బోర్డు కాలనీలో సోమవారం చోటుచేసుకున్న ఈ సంఘటన మున్సిపల్ అధికారుల తీరుపై విమర్శలకు తావిస్తోంది. ఇంటింటికి చెత్త సేకరించే ట్రాక్టర్‌ను తీసుకొచ్చిన పారిశుద్ధ్య సిబ్బంది.. కాలనీలో రాజేష్ కుమార్ నివాసం ముందు చెత్తను పోసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇంట్లోకి వెళ్లడానికి బయటకు రావడానికి వీలు లేకుండా దారికి అడ్డంగా చెత్త వేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా చెత్త సేకరించాల్సిన సిబ్బంది ఇలా ఇంటి ముందు చెత్త వేయడం వెనుక ఉద్దేశం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు రాజేష్ కుమార్ తన ఇంట్లో పెంచుకుంటున్న కుక్కలతో పాటు వీధి కుక్కలకు కూడా ఆహారం వేస్తుండటంతో ఆ ప్రాంతంలో కుక్కల సంచారం పెరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అటుగా వెళ్లే ప్రజలపై కుక్కలు దాడులు చేస్తున్నాయని ఈ సమస్యపై యజమానికి పలుమార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొంటున్నారు. అధికారులు కూడా గతంలో హెచ్చరించినా స్పందన లేకపోవడంతో ఈ చర్యకు దిగినట్లు మున్సిపల్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. మున్సిపల్ కమిషనర్ కాకర్ల సాంబశివరావు ఆదేశాల మేరకే సిబ్బంది ఇంటి ముందు చెత్త పోశారంటూ పట్టణంలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై కమిషనర్‌ను వివరణ కోరగా ఈ ఘటన తన దృష్టికి రాలేదని వివరాలు తెలుసుకుని తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న సమస్యపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు.. ఇలా ఇంటి ముందు చెత్త పోయడం ఎంతవరకు సమంజసమన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కుక్కల బెడదకు పరిష్కారం చూపాల్సిన మున్సిపాలిటీ మరో వివాదానికి కారణమైందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కక్ష సాధింపా?
Nov 10 2026 1:49 AM | Updated on Nov 10 2026 1:49 AM
ఇంటి ముందు చెత్త పోసిన పారిశుద్ధ్య సిబ్బంది
● రేపల్లె 13వ వార్డులో మున్సిపల్ సిబ్బంది నిర్వాకం
● నివాసంలోకి వెళ్లే దారికి యజమాని అవస్థలు
● కమిషనర్ ఆదేశాలతోనే చేశారంటూ ప్రచారం
● తనకు తెలియదన్న కమిషనర్
Advertisement


