గుంటూరురూరల్:స్నేహితునికి పక్షవాతం రావటంతో నాటు వైద్యం చేయించుకునేందుకు వెళ్లి తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ముగ్గురు గాయపడిన ఘటన నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ కృష్ణబాజీ తెలిపిన వివరాలు.. నగరంలోని శారదకాలనీకి చెందిన నందుకు పక్షవాతం వచ్చింది. దీంతో అదే ప్రాంతానికి చెందిన అతడి స్నేహితులు కిరణ్, రామకృష్ణ, వెంకటరావు, నవీన్ కలిసి చికిత్స చేయించేందుకు చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని విరూపాక్షపురానికి కారులో వెళ్లారు. తిరిగి వస్తూ శ్రీకాళహస్తిలో దేవుని దర్శనం చేసుకున్నారు. అనంతరం ఐదుగురు కారులో బయలుదేరారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌడవరం వద్ద తెల్లవారుజామున కారు ఎన్‌హెచ్16లో కల్వర్టు గోడకు ఢీకొంది. ప్రమాదంలో రామకృష్ణ(32), డ్రైవింగ్ చేస్తున్న కిరణ్(30) అక్కడికక్కడే మృతి చెందగా వెంకటరావు, నవీన్, నందులకు గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చెరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. మృతులను జీజీహెచ్‌కు తరలించి పోస్టుమార్టం నిర్వహించి మృతుల కుటుంబ సభ్యులకు అందజేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.
ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు


