చీరాల జెడ్పీటీసీ వైఎస్సార్‌ సీపీ కై వసం | - | Sakshi
Sakshi News home page

చీరాల జెడ్పీటీసీ వైఎస్సార్‌ సీపీ కై వసం

Nov 8 2026 4:35 AM | Updated on Nov 8 2026 4:35 AM

చీరాల జెడ్పీటీసీ వైఎస్సార్‌ సీపీ కై వసం

ఐదు ఎంపీటీసీ స్థానాల్లోనూ విజయం

చీరాల టౌన్‌: చీరాల జెడ్పీటీసీ స్థానాన్ని వైఎస్సార్‌ సీపీ కై వసం చేసుకుంది. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి బిట్రా శ్రీనివాసరావు తన సమీప బీజేపీ అభ్యర్థి నాశిన మణికుమార్‌ గౌడ్‌పై 2,669 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఓట్ల లెక్కింపును శనివారం రాత్రి వరకు చీరాల ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహించారు. మొదట పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించారు. జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ను నాలుగు రౌండ్లలో నిర్వహించగా, మొదటి రౌండ్‌లో బీజేపీ అభ్యర్థికి మెజార్టీ లభించింది. రెండో, మూడో, నాలుగో రౌండ్లలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగారు. ఈ ఎన్నికల్లో చేనేత సామాజిక వర్గానికి చెందిన వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నాయకుడు బిట్రా శ్రీనివాసరావుకు వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జి కరణం వెంకటేష్‌బాబు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో సగం విజయం ఖాయమైనట్లు నిర్ధారణ అయింది. ఈ పోటీలో కూటమి తరఫున బీజేపీ అభ్యర్థి నాశిన మణికుమార్‌ గౌడ్‌కు జెడ్పీటీసీ టికెట్‌ కేటాయించారు. రూరల్‌ గ్రామాల్లో బలమైన నాయకుడిగా, మాజీ జెడ్పీటీసీ బిట్రా సుజాత భర్తగా బిట్రా శ్రీనివాసరావుకు మంచి పట్టుంది. ఈ నేపథ్యంలో జరిగిన పోటీలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి బిట్రా విజేతగా నిలవడంతో చీరాల రూరల్‌ మండలంలో వైఎస్సార్‌ సీపీలో నూతనోత్సాహం నెలకొంది. మండలంలోని 24 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు ఐదు స్థానాల్లో విజయం సాధించారు. విజయనగర్‌ కాలనీలో తేళ్ల రాంబాబు, కావూరివారిపాలెంలో రత్నారెడ్డి, వాడరేవు–2 ప్రాదేశికంలో చిరుపల్లి శ్రీనుబాబు, గవినివారిపాలెం–2 ప్రాదేశికంలో గవిని ప్రసాద్‌, తోటవారిపాలెం–2 ప్రాదేశికంలో గంగిశెట్టి తాండవ లక్ష్మి విజయం సాధించారు. వాడరేవు–1లో జనసేన, వాడరేవు–3లో కాంగ్రెస్‌, రామకృష్ణాపురం–1, 2 స్థానాల్లో టీడీపీ, కొత్తపాలెంలో టీడీపీ, గవినివారిపాలెం–1లో టీడీపీ, ఈపురుపాలెం–5లో బీజేపీ, ఈపురుపాలెం–1లో స్వతంత్ర అభ్యర్థి, ఈపురుపాలెం–2, 3, 4 స్థానాల్లో టీడీపీ, దేవినూతలలో స్వతంత్ర అభ్యర్థి, దేవాంగపురి–1, 2, 3 ప్రాదేశికాల్లో టీడీపీ, చీరాల నగర్‌లో టీడీపీ, బుర్లవారిపాలెంలో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. మొత్తం 24 స్థానాల్లో టీడీపీ 14, వైఎస్సార్‌ సీపీ 5, జనసేన 1, స్వతంత్రులు 2, కాంగ్రెస్‌ 1 స్థానంలో విజయం సాధించారు. బిట్రా శ్రీనివాసరావుకు వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జి కరణం వెంకటేష్‌ అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement