లక్ష్మీపురం: గుంటూరు ప్రభుత్వ సమగ్రాసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందిన ఘటనపై నగరంపాలెం పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గుంటూరు చుట్టుగుంట నుంచి ఎత్తు రోడ్డు వెళ్లే మార్గంమధ్యలోని ఐటీసీ కంపెనీ వద్ద గల బస్టాప్ వద్ద అక్టోబర్ 30వ తేదీ ఉదయం సుమారు 6.30 గంటల సమయంలో సుభాని(65) స్పృహ కోల్పోయి పడిపోయాడు. దీన్ని గమనించిన స్థానికులు 108 ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న నగరంపాలెం పోలీసులు ఆసుపత్రిలో వివరాల సేకరించగా ఎలాంటి సమాచారం తెలియకపోవడంతోపాటు మృతి చెందిన వృద్ధుడి పేరు మాత్రం సుభాని అని తెలిసినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 9154880585, 8688831340 నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌కు సమాచారం తెలియజేయాలని తెలిపారు.
బస్సు కింద పడి
వ్యక్తి మృతి
పట్నంబజారు: బస్సు కింద పడి వ్యక్తి మృతి చెందిన ఘటనపై కేసు నమోదైంది. ఈస్ట్ ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెదనందిపాడుకు చెందిన ఒంటిపులి శివయ్య (62) సత్తెనపల్లిలో వారి బంధువులు చనిపోతే చూసేందుకు వెళ్లాడు. తిరిగి సత్తెనపల్లి నుంచి పెదనందిపాడు వెళ్లేందుకు గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌లో దిగాడు. ప్లాట్‌ఫామ్ నంబరు 18 వద్ద పెదనందిపాడుకు సంబంధించిన బస్సు వచ్చిన క్రమంలో హడావుడిగా ప్రయాణికులు నెట్టుకుంటుండటంతో బస్సు ఎక్కే ప్రయత్నం చేశాడు. ఈక్రమంలో అదుపు తప్పి ముందు టైరు కింద పడడంతో తలపై టైరు ఎక్కింది. శివయ్య అక్కడిక్కడే మృతిచెందాడు. ఈమేరకు ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


