గుంటూరు రూరల్: నగర శివారుల్లోని లాంలోని చలపతి ఫార్మసీ కళాశాలలో నిర్వహిస్తున్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంతర్ కళాశాల పురుషుల చెస్ టోర్నమెంట్లో ప్రతిభ కనబరిచి ఆరుగురు క్రీడాకారులు దక్షిణ భారత స్థాయి చెస్ టోర్నమెంట్‌లో ఏఎన్‌యూ తరుఫున పాల్గొని ప్రతిభ చూపారని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వడ్లమూడి పల్లవి తెలిపారు. శనివారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అభినందించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఏఎన్‌యూ పరిధిలోని వివిధ కళాశాలల నుంచి ఎంపికై న ప్రతిభావంతులైన క్రీడాకారులతో కూడిన జట్టు ఈ పోటీల్లో పాల్గొని ఏఎన్‌యూకి ప్రాతినిధ్యం వహించడం విశేషమన్నారు. జట్టుకు హర్షిత్ వర్ధన్ గెదెల(జేసీ కళాశాల), ఆర్.వి.ఆర్.అండ్ జె.సి.కళాశాలకు చెందిన ఇస్మాయిల్ ఎం.డి పవనకృష్ణ, ప్రసాద్, జి.అంజనికుమార్‌రెడ్డి, అభినయ్ ఎంపికయ్యారని తెలిపారు. జట్టుకు టీమ్ మేనేజర్‌గా చలపతి ఫార్మసీ కళాశాలకు చెందిన ఫీజికల్ డైరెక్టర్ పి.భానుప్రకాష్ వ్యవహరించనున్నారని తెలిపారు. చలపతి ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ డాక్టర్ వై.వి.ఆంజనేయులు, కళాశాల ప్రిన్సిపాల్ క్రీడాకారులను అభినందించారు.
ఏపీ మెగా హ్యాకథాన్‌లో విజ్ఞాన్ నిరుల విద్యార్థినులకు ప్రథమ బహుమతి
రూ.2 లక్షల నగదు పురస్కారం
గుంటూరు రూరల్: టాలెంట్ ఏపీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని సంగివలస అనిల్ నీరుకొండ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కళాశాలలో ఇటీవల నిర్వహించిన టాలెంట్ ఏపీ మెగా హ్యాకథాన్ 2026లో తమ కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ బహుమతి సాధించారని విజ్ఞాన్ నిరుల మహిళా ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పీ రాధిక తెలిపారు. శనివారం పెద్దపలకలూరు రోడ్డులోని కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ప్రిన్సిపల్ మాట్లాడుతూ కళాశాలకు చెందిన విద్యార్థులు ప్రథమ బహుమతితోపాటు రూ.2 లక్షల నగదు పురస్కారాన్ని గెలుచుకున్నారన్నారు. దేశవ్యాప్తంగా ఏడు వేలకి పైగా రిజిస్ట్రేషన్లు నమోదైన ఈ హ్యాకథాన్‌లో, ఏఐ ఆధారిత షార్ట్‌లిస్టింగ్ ద్వారా 140కి పైగా బృందాలు ఆఫ్‌లైన్ పోటీలకు ఎంపికయ్యాయని తెలిపారు. బృందంలో మందపాటి లాస్య, పరాంకుశం మైత్రేయి, పురమా నందినిలక్ష్మి, అవుల హేమ సభ్యులుగా ఉన్నారని చెప్పారు. విజ్ఞాన్ నిరులా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య విజేతలను అభినందించారు. విజయంపై వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు, డాక్టర్ వి.లక్ష్మణ్‌నారాయణ, డాక్టర్ ఎ.పెదగోపి, డాక్టర్ కె.సత్యసందీప్ తదితరులు అభినందించారు.
ఆటోలో మర్చిపోయిన బ్యాగ్ అప్పగింత
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఆటోలో మర్చిపోయిన బ్యాగ్‌ను, అందులో ఉన్న నగదును సంబంధిత మహిళకు అప్పగించిన ఘటన శనివారం జరిగింది. వివరాలు.. గుంటూరు జిల్లా సీతానగరానికి చెందిన దుర్గాభవాని ఆటో ఎక్కి కేఆర్ మార్కెట్‌కు వచ్చింది. హడావుడిలో తన బ్యాగ్‌ను ఆటోలో మర్చిపోయి ఆటో దిగిపోయింది. కొద్దిసేపటి తర్వాత తన బ్యాగ్ మర్చిపోయిన విషయం గుర్తుకు వచ్చి స్థానికంగా విచారించినా ఫలితం కనపడలేదు. దాంతో వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు వచ్చి వివరించగా వారు సీసీ ఫుటేజ్ ద్వారా ఆటో ను గుర్తించారు. ఆటోను ట్రేస్ చేసి పట్టుకోగా వెనుక సీటు వైపు బ్యాగ్ కనిపించింది. అందులో ఉన్న రూ.45 వేలు నగదు అందులోనే భద్రంగా ఉంది. దాంతో పోలీసులు ఆ బ్యాగ్‌ను దుర్గాభవానికి అప్పగించారు.
తాడికొండ: విద్యార్థులకు పరిశ్రమ అవసరాలకు తగిన నైపుణ్యాలను అందించి, వారి ఉద్యోగ అవకాశాలను మరింత విస్తృతం చేసే లక్ష్యంతో చలపతి విశ్వవిద్యాలయం ప్రపంచ ప్రఖ్యాత సాంకేతిక సంస్థ మైక్రోసాఫ్ట్‌తో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా విశ్వవిద్యాలయం అందిస్తున్న బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్–ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ (ఏఐ–ఎంఎల్) స్పెషలైజేషన్ కోర్సును మైక్రోసాఫ్ట్ సహకారంతో నిర్వహించనున్నారు. 2026–27 విద్యా సంవత్సరం నుంచి ప్రవేశం పొందిన విద్యార్థులకు ఈ ఒప్పందం వర్తిస్తుండగా, నైపుణ్య శిక్షణ కార్యక్రమం జనవరి 2027 నుంచి ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం బైట్‌ఎక్స్‌ఎల్ నైపుణ్య భాగస్వామ్యంతో (పవర్డ్ బై బైట్‌ఎక్స్‌ఎల్) అమలు కానుందని విశ్వవిద్యాలయ ఉపకులపతి బీవీ చౌదరి తెలిపారు.


