ప్రకృతిని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిదీ ఎకో పార్కులో ఘనంగా ముగిసిన బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాలు–2026
తాడేపల్లి రూరల్: పర్యావరణ పరిరక్షణ అనేది ప్రభుత్వాలు, అధికారుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే అన్నారు. పర్యావరణాన్ని కాపాడే మార్పు ముందుగా ప్రతి ఒక్కరి ఇంటి నుంచి ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో లైఫ్‌స్టైల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్, అటవీ, పర్యావరణ శాఖల సమన్వయంతో నవంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించిన ‘బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాలు–2026’ ముగింపు కార్యక్రమం శనివారం మంగళగిరి ఎకో పార్కులో ఘనంగా నిర్వహించారు. ‘ఒక వారం.. ఏడు ఆచరణలు.. ఒకే భూగోళం’ అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కాంతిలాల్ దండే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ బ్రిక్స్ దేశాల భాగస్వామ్యంతో పర్యావరణ పరిరక్షణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్దేశించిన లక్ష్యాల సాధనలో ప్రతి పౌరుడూ వలంటీర్‌గా మారాలన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి ఇంట్లో తడి, పొడి వ్యర్థాలను వేర్వేరుగా సేకరించే అలవాటు చేసుకోవాలని సూచించారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి ఈ మార్పును సమాజమంతటికీ విస్తరింపజేయాలని కోరారు. రాష్ట్రంలో పర్యావరణహిత చర్యల్లో భాగంగా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 660 మండలాల్లో స్వచ్ఛ రథాలను ఏర్పాటు చేసి పొడి వ్యర్థాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. ప్రతి కిలో ప్లాస్టిక్ వ్యర్థాలకు రూ.20 విలువైన నిత్యావసరాలను గ్రీన్ షాపుల ద్వారా అందించే విధానాన్ని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. వ్యర్థాల నుంచి వర్మీ కంపోస్ట్ తయారు చేసి మార్క్‌ఫెడ్ ద్వారా రైతులకు అందిస్తున్నట్లు వివరించారు. పాఠశాల విద్యార్థుల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ఏపీపీసీబీ ద్వారా స్టీల్ వాటర్ బాటిళ్లు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ డాక్టర్ పి.కృష్ణయ్య మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రత్యేకంగా పెద్ద కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం లేదని, రోజువారీ జీవితంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటేనే గణనీయమైన ఫలితాలు సాధించవచ్చన్నారు. బ్రష్ చేసుకునేటప్పుడు కుళాయి నీటిని వృథా చేయకుండా చూడాలని, మార్కెట్‌కు వెళ్లేటప్పుడు జూట్, గుడ్డ సంచులు తీసుకెళ్లి ప్లాస్టిక్ కవర్లకు దూరంగా ఉండాలని సూచించారు. శుభకార్యాలు, వేడుకల్లో అవసరమైనంత ఆహారాన్నే తీసుకొని ఆహార వృథాను అరికట్టాలని, గదుల నుంచి బయటకు వచ్చేటప్పుడు ఫ్యాన్లు, లైట్లు ఆపి విద్యుత్‌ను ఆదా చేయాలని కోరారు.
ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ డాక్టర్ పి.వి.చలపతిరావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ వారోత్సవాలకే పరిమితం కాకుండా నిత్యజీవితంలో భాగం కావాలన్నారు. వారోత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించడంలో కీలకపాత్ర పోషించిన స్టేట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మహమ్మద్ దివాన్ మొహిద్దీన్‌ను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, అధికారులు పర్యావరణహిత జీవనశైలిని పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, లైఫ్‌స్టైల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను కాంతిలాల్ దండే సందర్శించారు. కార్యక్రమంలో అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు బి.ఎన్.ఎన్. మూర్తి, రేవతి, కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ శరవణన్, స్టేట్ విజిలెన్స్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్లు ధర్మ రక్షిత, శ్రీ సాయి పాల్గొన్నారు.


