గుంటూరు లీగల్: గుంటూరు బార్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశంలో తీసుకున్న తీర్మానం మేరకు, హైకోర్టు న్యాయమూర్తి, గుంటూరు జిల్లా పోర్ట్‌ఫోలియో జడ్జి జస్టిస్ డి.రమేష్‌ను బార్ అసోసియేషన్ ప్రతినిధులు సోమవారం హైకోర్టులోని ఆయన చాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. అమరావతి, చేబ్రోలు, తాడికొండ ప్రాంతాలు గుంటూరు న్యాయస్థానాల పరిధిలోనే కొనసాగించాలని, సిటీ సివిల్ కోర్టులు, కమర్షియల్ కోర్టులను గుంటూరులో ఏర్పాటు చేయాలని, విశాఖపట్నంలో ఉన్న డీఆర్‌టీ (డెట్ రికవరీ ట్రిబ్యునల్)కు గుంటూరులో బెంచ్ ఏర్పాటు చేయాలని వినతిపత్రంలో కోరారు. ఈ అంశాలపై జస్టిస్ డి.రమేష్ సానుకూలంగా స్పందించినట్లు బార్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మధిర నాగేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ రేవతి, జనరల్ సెక్రటరీ నారదాసు వీరమనేంద్ర, ట్రెజరర్ ఆకుల సుజాత, లేడీ రిప్రజెంటేటివ్ ఇందిరా, ఈసీ సభ్యుడు బాషా పాల్గొన్నారు.
విజ్ఞాన్‌లో ‘బయోమెడ్–26 వర్క్‌షాప్, హ్యాకథాన్’ ప్రారంభం
చేబ్రోలు: బయోమెడికల్ డేటా విశ్లేషణలో కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగం వైద్య పరిశోధనల్లో నూతన అవకాశాలను సృష్టిస్తోందని ఐఐటీ గువాహటి బయోటెక్నాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ వెంకట దాసు వీరంకి ేతెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో ఐదు రోజులపాటు నిర్వహించనున్న జాతీయ స్థాయి వర్క్‌షాప్, హ్యాకథాన్ ‘ఏఐ4 బయోమెడ్–26’ మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. ‘బయోమెడికల్ డేటా కోసం కృత్రిమ మేధస్సు’ అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మూడు రోజుల ప్రాయోగిక శిక్షణతోపాటు రెండు రోజుల బయో–ఏఐ హ్యాకథాన్‌ను ఇందులో భాగంగా ఏర్పాటు చేశారు. ప్రారంభ కార్యక్రమానికి హాజరైన డాక్టర్ వెంకట దాసు వీరంకి మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్, డేటా సైన్స్, కృత్రిమ మేధస్సు పరస్పరం అనుసంధానమై వేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. విద్యార్థులు కేవలం సైద్ధాంతిక పరిజ్ఞానానికే పరిమితం కాకుండా, వాస్తవ సమస్యలను గుర్తించి సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేసే నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ప్రతిభ కనబరిచిన బృందాలకు మొత్తం రూ.10వేలు నగదు బహుమతులను అందించనున్నారు. కార్యక్రమంలో డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
కాలువలో పడి వ్యక్తి మృతి
తాడికొండ: కాలువలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన తుళ్లూరు మండలం వెంకటపాలెం పరిధిలో జరిగింది. వివరాల ప్రకారం.. వెస్ట్ బైపాస్ కింద కాలువలో మృతదేహం ఉన్నట్లు స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ మురళీధర్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడు వైజాగ్‌కు చెందిన రమేష్ (27)గా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఏపీటీఐ రాష్ట్ర శాఖకు ‘ఉత్తమ కాంట్రిబ్యూషన్’ అవార్డు
తెనాలి: రాయపూర్‌లోని పండిట్ రవిశంకర్ శుక్లా విశ్వవిద్యాలయంలో ‘అసోసియేషన్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ టీచర్స్ ఆఫ్ ఇండియా’ (ఏపీటీఐ) ఆధ్వర్యంలో జరిగిన 28వ జాతీయ ఏపీటీఐసీఓఎన్ సదస్సులో ఏపీటీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖకు 2026 సంవత్సరానికి బెస్ట్ కంట్రిబ్యూషన్ స్టేట్ బ్రాంచ్ అవార్డును ప్రదానం చేశారు. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును ఏపీటీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు, స్థానిక ఏఎస్‌ఎన్. ఫార్మసీ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వెంకట రమణ స్వీకరించారు. ఈనెల 24, 25 తేదీల్లో జరిగిన సదస్సులో అందుకున్న గౌరవం వివరాలను మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో ఫార్మసీ విద్య అభివృద్ధి, అధ్యాపకుల నైపుణ్యాభివృద్ధి, విద్యార్థుల్లో పరిశోధనా దృక్పథాన్ని పెంపొందించడం, ఫార్మసీ రంగంలో నాణ్యమైన విద్యను ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలకు ఈ గుర్తింపు లభించటం, మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని ఫార్మసీ విద్యాసంస్థల యాజమాన్యాలు, అధ్యాపకులు, విద్యార్థులు అందించిన సహకారం, ప్రోత్సాహంతోనే ఈ జాతీయ స్థాయి గుర్తింపును సాధించగలిగామని అన్నారు. జాతీయ సదస్సులో ఏపీటీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షులు డాక్టర్ వై.అంకమ్మ చౌదరి, డాక్టర్ ఎ.లక్ష్మణరావు, కార్యదర్శి, పీసీఐ సెంట్రల్ కౌన్సిల్ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ డి.నరేంద్ర, ఏపీటీఐ ఉమెన్‌్స్ ఫోరం కన్వీనర్ డాక్టర్ కె.పద్మలత, కార్యవర్గసభ్యులు జేవీ సురేష్, డాక్టర్ జగదీష్ పాండా, కె.హిమబిందు పాల్గొన్నారని వివరించారు.


