మంగళగిరి రూరల్: మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్లే వ్యక్తులను కత్తులతో బెదిరించి నగదు, సెల్ఫోన్లు దోచుకోవడంతోపాటు, తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ముఠాను మంగళగిరి రూరల్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. పట్టుబడిన ఎనిమిది మందిలో ఆరుగురు మైనర్లు ఉన్నారు. నిందితుల నుంచి ఒక ఆటో, మూడు సెల్ఫోన్లు, రూ.30 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రూరల్ సీఐ చిరుమామిళ్ల వెంకట్ వివరాలు వెల్లడించారు. నిందితులు రాత్రి వేళల్లో ఆటోలో తిరుగుతూ ఒంటరిగా వెళ్లే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని కత్తులతో వారిని బెదిరించి నగదు, సెల్ఫోన్లు లాక్కోవడంతో పాటు, తాళం వేసిన ఇళ్లను గుర్తించి రాళ్లతో తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడి నగదు దొంగిలించేవారు.ఈ నెల 22న ఎరబ్రాలెం సమీపంలోని పొగాకు కంపెనీ వద్ద నడుచుకుంటూ వెళ్తున్న నవులూరుకు చెందిన మద్దెబోయిన శివశంకర్రావును అడ్డగించి రూ.3 వేల నగదు, సెల్ఫోన్ దోచుకున్నారు. అదే రోజు అర్ధరాత్రి ఆత్మకూరు జంక్షన్ వద్ద ఆటో ఎక్కిన ఉలవపాడుకు చెందిన వేమిరెడ్డి శ్రీకాంత్రెడ్డిని అక్షయపాత్ర సమీపంలో బెదిరించి పొలాల్లోకి తీసుకెళ్లి రూ.12 వేల నగదును లాక్కున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే ఈ నెల 21న నవులూరులో తాళం వేసి ఉన్న రెండు ఇళ్లలో చోరీలకు పాల్పడి ఒక ఇంటి నుంచి రూ.20 వేలు, మరో ఇంటి నుంచి రూ.18 వేల నగదును అపహరించారు. సుమారు పది రోజుల క్రితం చినకాకాని ఎన్ఆర్ఐ జంక్షన్ వద్ద మరో వ్యక్తిని బెదిరించి సెల్ఫోన్ దోచుకున్నట్లు వెల్లడించారు.ఈ కేసుల్లో నిందితులుగా ముగిలి గోపి, కలుముల కష్ణతో పాటు 13 నుంచి 17 సంవత్సరాల మధ్య వయసున్న ఆరుగురు బాలురను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరో నిందితుడు మాధవ్ అలియాస్ సిద్ధు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. కేసును ఛేదించడంలో కృషి చేసిన మంగళగిరి రూరల్ సీఐ సీహెచ్. వెంకటేశ్వర్లు, ఎస్సై ఆర్.నవీన్ నాయక్, ఏఎస్సై రత్నరాజు, హెచ్సీ రాము, పీసీ సాగర్, హెచ్జీ వీరయ్యలను పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు.


